EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పాత కంపెనీతో పని లేకుండానే మీ డబ్బు మీ చేతికి
పాత కంపెనీతో పని లేకుండానే మీ డబ్బు మీ చేతికి
EPFO : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. గతంలో పని చేసిన కంపెనీల్లో నిలిచిపోయిన మీ పీఎఫ్ సొమ్మును తిరిగి పొందడం ఇప్పుడు మరింత సులభం కానుంది. పాత కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఇంటి వద్దే కూర్చుని మీ ఖాతాను యాక్టివేట్ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ సరికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకువచ్చింది.
ఏమిటీ ఈ-ప్రాప్తి పోర్టల్?
ఉద్యోగం మారినప్పుడు చాలామంది తమ పాత పీఎఫ్ ఖాతాలను పట్టించుకోరు. కాలక్రమేణా ఆ కంపెనీలు మూతపడటం లేదా పాత యాజమాన్యం సహకరించకపోవడంతో ఆ డబ్బులు అలాగే ఉండిపోతాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర కార్మిక మంత్రి మనసుఖ్ మాండవీయ ఈ-ప్రాప్తి అనే కొత్త పోర్టల్‌ను ప్రకటించారు. ఇది పూర్తిస్థాయిలో ఆధార్ ఆధారిత డిజిటల్ సిస్టమ్. దీనివల్ల ఉద్యోగి తన పాత అకౌంట్‌ను ట్రాక్ చేయడం, దాన్ని ప్రస్తుత ఖాతాలో విలీనం చేయడం లేదా డబ్బు డ్రా చేయడం చాలా సులభం అవుతుంది.
పాత కంపెనీల వేధింపులకు స్వస్తి
ఇప్పటివరకు పాత పీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే పాత కంపెనీ యజమాని అప్రూవల్ లేదా సంతకం తప్పనిసరి ఉండేది. కానీ కొత్త విధానంలో ఈ నిబంధనను ఎత్తివేశారు. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఉద్యోగి నేరుగా తన ఖాతాను నిర్వహించుకోవచ్చు. మొదటి దశలో మెంబర్ ఐడి ఉన్నవారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో ఐడి లేకపోయినా ఇతర వివరాలతో ఖాతాను వెతికే వెసులుబాటు కల్పించనున్నారు.
మూడు రోజుల్లోనే నగదు జమ
ఈపీఎఫ్ఓ కేవలం కొత్త పోర్టల్‌కే పరిమితం కాకుండా, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8.31 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించారు. బ్యాంక్ వివరాల అప్‌డేషన్ సులభతరం చేయడం, చెక్కుల కాపీల అప్‌లోడ్ వంటి పాత నిబంధనలను తొలగించడంతో.. ఇప్పుడు క్లెయిమ్ చేసిన మూడు రోజుల్లోనే డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ అవుతున్నాయి. ఇది అత్యవసరంగా డబ్బు కావాల్సిన ఉద్యోగులకు కొండంత అండగా మారుతోంది.
అటో-ప్రాసెసింగ్ స్పీడ్
సిస్టమ్ తప్పులు లేకుండా పని చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ టెక్నాలజీని ఈపీఎఫ్ఓ వాడుతోంది. 2026లో వచ్చిన 5.5 కోట్ల అడ్వాన్స్ క్లెయిమ్‌లలో దాదాపు 71 శాతం క్లెయిమ్‌లను ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా కంప్యూటర్లే ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్ నెలలో కూడా ఇదే జోరు కొనసాగింది, మొత్తం క్లెయిమ్‌లలో 74 శాతం ఆటోమేటిక్ పద్ధతిలో కేవలం మూడు రోజుల్లోనే పూర్తయ్యాయి. డిజిటల్ ఇండియా దిశగా ఈపీఎఫ్ఓ వేస్తున్న ఈ అడుగులు ఉద్యోగుల భవిష్యత్ నిధిని మరింత సురక్షితం చేస్తున్నాయి.