EPS : మీకే కాదు.. మీ తర్వాత మీ కుటుంబానికి కూడా పెన్షన్.. ఈపీఎస్‌లోని 5 సూపర్ బెనిఫిట్స్ ఇవే
ఈపీఎస్‌లోని 5 సూపర్ బెనిఫిట్స్ ఇవే
EPS : ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(EPS). చాలా మంది ఈ పథకాన్ని కేవలం రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ ఇచ్చే ఒక సాధారణ స్కీమ్‌గా భావిస్తారు. కానీ, ఈపీఎస్ అనేది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే కాకుండా ఒకవేళ ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు కూడా బలమైన ఆర్థిక రక్షణ కల్పించేలా డిజైన్ చేయబడింది. ఈ పథకం కింద భాగస్వామి, పిల్లలు, నామినీలు, ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా కొన్ని ప్రత్యేక షరతులతో కూడిన 5 అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భార్య లేదా భర్తకు వితంతు పెన్షన్
ఈపీఎస్ స్కీమ్‌లో ఉన్న మొదటి, ప్రధాన ప్రయోజనం వితంతు పెన్షన్. ఒకవేళ ఈపీఎస్ లో మెంబర్‌గా ఉన్న ఉద్యోగి అకాల మరణం చెందితే, వారి జీవిత భాగస్వామి ఈ నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. ఈ పెన్షన్ పొందాలంటే సదరు ఉద్యోగి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సంస్థలో కనీసం ఒక నెల పాటు పనిచేసి, పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందించి ఉండాలి. సదరు భాగస్వామి బతికున్నంత వరకు లేదా మళ్లీ పెళ్లి చేసుకునేంత వరకు ఈ పెన్షన్ నిరంతరాయంగా అందుతుంది. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు చట్టబద్ధంగా ఉంటే, వయసులో అందరికంటే పెద్దవారైన భార్యకు ఈ పెన్షన్ మొదట అందుతుంది.
పిల్లల భవిష్యత్తుకు భరోసా
ఉద్యోగి మరణించిన తర్వాత వారి భార్య లేదా భర్తకు వచ్చే వితంతు పెన్షన్‌తో పాటు, వారి పిల్లలకు కూడా ఈపీఎస్ పథకం అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనిని పిల్లల పెన్షన్ అంటారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అర్హులైన పిల్లలకు ఈ పెన్షన్ సదుపాయం ఒకేసారి అందుబాటులో ఉంటుంది. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలో జమ చేయబడతాయి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా శాశ్వత శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతుంటే, అలాంటి ప్రత్యేక పిల్లలకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
నిరాశ్రయులైన పిల్లలకు లక్కీ ఛాన్స్
ఒకవేళ ఈపీఎస్ సభ్యుడైన ఉద్యోగి మరణించి, అంతకు ముందే వారి జీవిత భాగస్వామి కూడా మరణించి ఉంటే, లేదా పెన్షన్ వస్తున్న సమయంలోనే భాగస్వామి కూడా కన్నుమూస్తే.. ఆ ఇంట్లోని పిల్లలు ఒంటరివారవుతారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను ఆదుకోవడానికి ఈపీఎస్ కింద అనాథ పెన్షన్ సౌకర్యం కల్పించారు. సాధారణ పిల్లల పెన్షన్ కంటే అనాథ పెన్షన్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కుటుంబంలోని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు, వారికి 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు నెలవారీ ఆర్థిక ఆసరాగా అందుతుంది.
అవివాహిత ఉద్యోగుల కోసం నామినీ పెన్షన్
ఉద్యోగికి వివాహం కాకపోయినా లేదా పైన పేర్కొన్న విధంగా భార్య, పిల్లలు వంటి అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోయినా ఈపీఎస్ డబ్బులు వృథా కావు. అలాంటి పరిమిత పరిస్థితుల్లో ఉద్యోగి ముందే నిర్ణయించుకున్న వ్యక్తికి నామినీ పెన్షన్ లభిస్తుంది. ఇందుకోసం ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాలో ఇ-నామినేషన్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఒకవేళ ఉద్యోగి నామినేషన్ వేసిన తర్వాత పెళ్లి చేసుకుని, అతనికి భార్య లేదా పిల్లలు ఉంటే, పాత నామినేషన్ ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది. కొత్తగా ఏర్పడిన కుటుంబ సభ్యులే అసలైన లబ్ధిదారులుగా మారుతారు.
ఎవరూ లేకపోతే డిపెండెంట్ తల్లిదండ్రులకు ఆసరా
ఈపీఎస్ పథకంలో ఉన్న మరో ఫీచర్ ఆధారపడిన తల్లిదండ్రుల పెన్షన్. ఒకవేళ మరణించిన ఉద్యోగికి భార్య, పిల్లలు లేదా వాలిడ్ నామినీ ఎవరూ లేని పక్షంలో, అతనిపైనే పూర్తిగా ఆధారపడి బతుకుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఈ పెన్షన్ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగి మరణానంతరం మొదట ఆధారపడిన తండ్రికి జీవితాంతం నెలవారీ పెన్షన్ ఇస్తారు. తండ్రి మరణించిన తర్వాత, ఆధారపడిన వృద్ధ తల్లికి ఆ పెన్షన్ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వారి వృద్ధాప్యానికి కొండంత భరోసాను కల్పిస్తుంది.