Cooking Fuel : ఎల్‌పీజీ సిలిండర్ల చెక్.. పెట్రోల్ తర్వాత ఇప్పుడు వంటగదిలోకి ఇథనాల్

వంటగదిలోకి ఇథనాల్

Update: 2026-07-20 11:46 GMT

Cooking Fuel : పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌తో విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ, క్లీన్ ఫ్యూయెల్ సాధన దిశగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. మన ఇళ్లలో రోజువారీ వాడే ఎల్‌పీజీ వంటగ్యాస్ స్థానంలో ఇథనాల్‌ను ప్రధాన కుకింగ్ ఫ్యూయెల్‌గా ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సాంప్రదాయ గ్యాస్ సిలిండర్లపైన భారతీయుల ఆధారపడటం తగ్గడమే కాకుండా, సగటు గృహిణి వంట బడ్జెట్‌కు భారీ ఊరట లభించనుంది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక పాలసీ ప్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది.

సెప్టెంబర్ నాటికి కేంద్రం కొత్త పాలసీ

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రత్యామ్నాయ క్లీన్ కుకింగ్ ఫ్యూయెల్ పాలసీ సిద్ధమయ్యే అవకాశం ఉందని ఇంధన రంగ అధికారులు వెల్లడించారు. చక్కెర, ధాన్యాలను ఫర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథనాల్ అనే వృక్ష ఆధారిత గ్రీన్ ఫ్యూయెల్ తయారవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ సూచనల మేరకు ఇథనాల్ ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన వంట స్టవ్‌ల క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి వినియోగదారులకు ఇథనాల్ స్టవ్‌ల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఇథనాల్ వంట స్టవ్‌ల టెస్టింగ్ పూర్తి

ఇథనాల్ ఇంధనాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో లేదా రీటైల్ అవుట్‌లెట్లలో ప్రత్యేకంగా ఇథనాల్ ఏటీఎమ్ లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. వినియోగదారులు తమ వెంట తెచ్చుకునే ప్రత్యేక క్యాన్లు లేదా డబ్బాలలో ఈ ఏటీఎమ్‌ల ద్వారా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇథనాల్ ఇంధనాన్ని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్లవచ్చు. దీని కోసం ప్రత్యేకమైన సాంకేతిక భాగస్వామ్యాలను కూడా ఆయిల్ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి.

ఎల్‌పీజీ దిగుమతులకు స్వస్తి

భారత్‌లో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 20 బిలియన్ లీటర్లు దాటింది. పెట్రోల్ మిశ్రమం (E20) కోసం 11 బిలియన్ లీటర్లు, మద్యం, ఫార్మా, కెమికల్ రంగాలు కలిపి 3.5 బిలియన్ లీటర్లు వాడినా, మన వద్ద ఇంకా ఏటా 7 బిలియన్ లీటర్ల అదనపు ఇథనాల్ నిల్వలు మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం భారత్ తన ఎల్‌పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఆధారపడుతోంది. పశ్చిమాసియా యుద్ధాలు, హార్ముజ్ జలసంధి సమస్యలు వచ్చినప్పుడు గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అందుకే ఈ మిగులు ఇథనాల్‌ను వంటగ్యాస్‌గా మార్చడం ద్వారా విదేశీ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది.

రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ ఆదా

ఇథనాల్ ఆధారిత వంట విధానం, బయోగాస్‌లను ప్రోత్సహించడం ద్వారా భారత ప్రభుత్వం 2050 నాటికి ఎల్‌పీజీ సబ్సిడీల రూపంలో ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా (24 బిలియన్ డాలర్లు) సొమ్మును ఆదా చేయవచ్చని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్వదేశీ ఇంధనాన్ని వినియోగించడం వల్ల చమురు దిగుమతుల బిల్లు తగ్గడమే కాకుండా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే సురక్షితమైన, పర్యావరణహితమైన వంట ఇంధనం లభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News