Fuel Saving : పెట్రో మంటల నుంచి ఊరటనిచ్చే కొత్త టెక్నాలజీ..మైలేజీ పెరగడమే కాదు..కాలుష్యం కూడా ఉండదు
మైలేజీ పెరగడమే కాదు..కాలుష్యం కూడా ఉండదు
Fuel Saving : ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతున్న వేళ, సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నీటి సాయంతో ఇంధనాన్ని ఆదా చేసే ఒక వినూత్న టెక్నాలజీ వెలుగులోకి వచ్చింది. మొనాకోకు చెందిన FOWE ఎకో సొల్యూషన్స్ అనే కంపెనీ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం నీటిని ఇంధనంలో కలిపి వాడటం ద్వారా ఏకంగా 10 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ఈ కంపెనీ గట్టిగా చెబుతోంది.
ఏమిటీ టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది?
ఈ వినూత్న విధానాన్ని కంట్రోల్డ్ క్యావిటేషన్ టెక్నాలజీ(CCT) అని పిలుస్తారు. సాధారణంగా నీరు, చమురు కలవవు. కానీ, ఈ టెక్నాలజీ ద్వారా ఇంధనంలో అతి చిన్న నీటి బిందువులను కెమికల్స్ అవసరం లేకుండానే కలిపేస్తారు. ఈ మిశ్రమం ఇంజన్ లేదా బాయిలర్లలో మండినప్పుడు, ఆ నీటి బిందువులు చిన్నపాటి పేలుళ్లను సృష్టిస్తాయి. దీనివల్ల ఇంధనం మరింత సూక్ష్మ కణాలుగా విడిపోయి, పూర్తిగా మండుతుంది. ఫలితంగా తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది.
పరీక్షల్లో అదిరే ఫలితాలు.. 10 శాతం ఆదా
ఈ టెక్నాలజీ ఏదో ఊహల్లో పుట్టింది కాదు. ఇప్పటికే డెన్మార్క్‌లోని ఆల్ఫా లావల్ టెస్టింగ్ ల్యాబ్స్‌లో చేసిన ప్రయోగాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. భారీ ఓడల ఇంజన్లలో 8.7 శాతం, బాయిలర్లలో 6.3 శాతం ఇంధనం ఆదా అయినట్లు గుర్తించారు. అలాగే స్కార్పియో ట్యాంకర్స్ అనే షిప్పింగ్ కంపెనీ వాడినప్పుడు దాదాపు 10 శాతం ఫ్యూయల్ ఆదా అయింది. భారత్‌లో కూడా కొన్ని స్టీల్ ప్లాంట్లు, రిఫైనరీలలో దీని ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా సానుకూల ఫలితాలే వస్తున్నట్లు సమాచారం.
ఇంజన్ మార్చాల్సిన పనిలేదు
ఈ టెక్నాలజీలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికోసం భారీ మెషీన్లను లేదా ఇంజన్లను మార్చాల్సిన అవసరం లేదు. ఉన్న యంత్రాలకే ఈ వ్యవస్థను అమర్చుకోవచ్చు. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) ఉద్గారాలు 30 శాతం, సల్ఫర్ ఆక్సైడ్ (SOx) ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, యంత్రాల లోపల మురికి చేరదు కాబట్టి, మెయింటెనెన్స్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.
భారతదేశానికి ఇది ఎందుకు ముఖ్యం?
భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. డాలర్ విలువ పెరిగినా, అంతర్జాతీయంగా యుద్ధాలు జరిగినా మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇలాంటి సమయంలో 10 శాతం ఇంధనం ఆదా అయినా, దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పారిశ్రామిక రంగంలో ఈ టెక్నాలజీని వాడితే వస్తువుల తయారీ ఖర్చు తగ్గి, సామాన్యుడిపై ధరల భారం తగ్గే అవకాశం ఉంది. నీటితో ఇంధనం ఆదా అనేది వినడానికి వింతగా ఉన్నా, ఇది మన భవిష్యత్తును మార్చే టెక్నాలజీ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.