FSSAI : ఫుడ్, ఎనర్జీ డ్రింక్స్ బ్రాండ్లకు చుక్కలు చూపించిన FSSAI.. 14 కంపెనీలకు షాకింగ్ నోటీసులు

14 కంపెనీలకు షాకింగ్ నోటీసులు

Update: 2026-07-04 08:42 GMT

FSSAI : భారతదేశంలో ఫుడ్, ఎనర్జీ డ్రింక్స్ తయారు చేసే కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు FSSAI రంగంలోకి దిగింది. గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మొత్తం 14 ప్రముఖ కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. ఇందులో తమ ఉత్పత్తుల పేర్లు, ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న 8 కంపెనీలు ఉన్నాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మరో 6 పెద్ద బ్రాండ్లపై కూడా ఈ చర్యలు తీసుకున్నారు. ఆహార భద్రత, ప్రకటనల పారదర్శకత విషయంలో తాము ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఈ కఠిన చర్యల ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో భారత ఫుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

లక్షల కోట్ల రూపాయల ఎనర్జీ డ్రింక్స్ సామ్రాజ్యం

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసటను దూరం చేసుకునేందుకు చాలామంది ఎనర్జీ డ్రింక్స్‌ను ఒక క్విక్ ఫిక్స్ లా వాడుతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దేశీయ, బహుళజాతి కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, దూకుడు మార్కెటింగ్‌తో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 85 నుంచి 92 బిలియన్ డాలర్లు (దాదాపు 8.1 నుంచి 8.8 లక్షల కోట్ల రూపాయలు) గా ఉంది. ఇది 2033 నాటికి ఏకంగా 158 బిలియన్ డాలర్లకు (రూ.15.1 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని అంచనా. ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే, మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మనదేశంలో ఈ బిజినెస్ విలువ 0.75 నుంచి 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,164 కోట్ల నుంచి రూ. 14,328 కోట్లు) గా ఉంది. నగరాల్లో పెరుగుతున్న యువత, ఫిట్‌నెస్ అవగాహన, గిగ్ వర్క్‌ఫోర్స్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ఏ రకం డ్రింక్స్‌కు ఎంత డిమాండ్ ఉంది?

మార్కెట్ విభజనను పరిశీలిస్తే, 2025లో సాంప్రదాయ ఎనర్జీ డ్రింక్స్ 32.56% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి. అయితే, సహజ, ఆర్గానిక్ డ్రింక్స్ అమ్మకాలు 2031 నాటికి 4.21% CAGR వృద్ధి రేటుతో పుంజుకోనున్నాయి. ప్యాకేజింగ్ పరంగా చూస్తే, 2025లో 51.25% వాటాతో పీఈటీ బాటిళ్లు ముందంజలో ఉండగా, గాజు సీసాలు 3.79% CAGR వృద్ధి రేటుతో వేగంగా దూసుకొస్తున్నాయి. విక్రయాల మార్గాల విషయానికొస్తే, 2025లో స్టోర్లు, ఆన్‌లైన్ (ఆఫ్-ట్రేడ్ చానల్స్) ద్వారా 65.38% అమ్మకాలు జరిగాయి. హోటళ్లు, బార్‌లు, కేఫ్‌లు ద్వారా జరిగే అమ్మకాలు 2031 నాటికి 4.48% CAGR వేగంతో పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆహార భద్రత చట్టం 2006 ఏం చెబుతోంది?

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 కింద అత్యంత కఠినమైన నిబంధనలను రూపొందించింది.

భ్రమ కలిగించే ప్రకటనలు: శాస్త్రీయంగా నిరూపితం కాని ఎలాంటి అవాస్తవ ప్రకటనలను కంపెనీలు చేయకూడదు. ఉదాహరణకు, ఏదైనా బ్రెడ్ ప్యాకెట్ పై జీరో మైదా అని రాస్తే, అందులో మైదా పిండి శాతమే ఉండకూడదు.

ఆరోగ్య సంబంధిత క్లెయిమ్స్: ఒక ఉత్పత్తిని తింటే లేదా తాగితే వ్యాధులు నయమవుతాయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, తక్షణ శక్తి వస్తుంది అని ప్రచారం చేయాలంటే ముందుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి తప్పనిసరి. ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలు తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి క్లెయిమ్స్ చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది.

లేబ్లింగ్ మరియు పేర్లు: బ్రాండ్ల పేర్లు కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు. పేరులో హెల్తీ అని ఉంటే, అది నిజంగానే ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వీగన్ సర్టిఫికేషన్: ఏదైనా ఉత్పత్తిని వీగన్ (శాకాహార అత్యున్నత రూపం) అని పిలవాలంటే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ప్రత్యేక లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి.

20 రోజుల్లో 14 కంపెనీలపై వేటు

గడిచిన కేవలం 20 రోజుల్లోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 14 పెద్ద బ్రాండ్లపై గట్టి యాక్షన్ తీసుకుంది. 6 ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలకు నోటీసులు ఇస్తూ.. "శరీరానికి, మనస్సుకు తాజాదనం", "ఫోకస్ పెంచడం", "సాధారణ బలహీనతను దూరం చేయడం" వంటి వాగ్దానాలు చట్టప్రకారం చెల్లవని స్పష్టం చేసింది. అంతకుముందు జూన్ 14, 2026న ఇమామి హెల్తీ అండ్ టేస్టీ, ద హెల్త్ ఫ్యాక్టరీ, ట్రూవీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, ప్లాన్ బి, న్యూహెర్బ్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు నోటీసులు జారీ అయ్యాయి. 'జీరో మైదా' అని చెప్పిన బ్రెడ్‌లో గ్లూటెన్ లభించడం, 'హెల్తీ' ట్యాగ్ తగిలించి నాణ్యత లేని స్నాక్స్ విక్రయించడం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News