Petrol Price : సామాన్యుడి జేబుకు భారీ ఊరట.. త్వరలోనే లీటరుకు రూ.4 వరకు తగ్గనున్న ఇంధన ధరలు
ఇంధన ధరలు
Petrol Price : భారతదేశంలోని మధ్యతరగతి వాహనదారులకు త్వరలోనే పెద్ద ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పతనమవడంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు మార్గ సుగమం అయింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఒకానొక దశలో ఉన్న గరిష్ట స్థాయిల నుంచి సుమారు 40 శాతానికి పైగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 నుంచి రూ.4 వరకు తగ్గించే అవకాశం ఉందని ఎనర్జీ, జియోపొలిటికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తగ్గింపు ప్రయోజనాలు సామాన్య కస్టమర్లకు అందడానికి జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారం వరకు సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ అయిన నయారా ఎనర్జీ ఇప్పటికే తమ బంకుల్లో ఇంధన ధరలను తగ్గించి సంచలనం సృష్టించింది. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా నయారా సంస్థ పెట్రోల్ ధరపై లీటరుకు రూ.5, డీజిల్ ధరపై లీటరుకు రూ.3 తగ్గించింది. గతంలో పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా పెంచిన ధరలను కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఉపసంహరించుకుంది. అయితే, దేశంలో 90 శాతానికి పైగా ఇంధన మార్కెట్‌ను నియంత్రిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం(HPCL) లు మాత్రం ధరల తగ్గింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గాయి. దీంతో భారతీయ క్రూడ్ బాస్కెట్ ధర చరిత్రలో మొదటిసారిగా బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు (సుమారు 68.86 డాలర్లు) పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున మేలు జరగడమే కాకుండా, అంతర్జాతీయంగా భారత రూపాయి విలువ కూడా బలపడింది. మే నెలలో డాలర్‌తో పోలిస్తే 97 వద్ద రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన రూపాయి, జూన్ నాటికి కోలుకుని 94.50 వద్ద స్థిరపడింది. దీనివల్ల ఆసియాలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరెన్సీలలో రూపాయి ఒకటిగా నిలిచింది.
గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, మన దేశంలో పెట్రోల్ బంకుల్లో రేట్లు వెంటనే తగ్గకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. భారతదేశం చమురును వారాల ముందే కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం రిఫైనరీలు గతంలో కొనుగోలు చేసిన ఖరీదైన ముడిచమురునే వాడుతున్నాయి. అంతర్జాతీయ ధరల తగ్గింపు ప్రభావం మన రిటైల్ మార్కెట్‌పై పడటానికి కనీసం 2 నుంచి 4 వారాల సమయం పడుతుంది. దీనితో పాటు, గతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆ భారాన్ని పూర్తిగా కస్టమర్లపై వేయకుండా దాదాపు రూ.లక్ష కోట్ల వరకు నష్టాలను తామే భరించాయి. ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి కూడా కంపెనీలకు కొంత సమయం అవసరమవుతుంది.
ముడిచమురు ధరల తగ్గింపు ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్‌పైనే కాకుండా ఇతర ఇంధనాలపైనా పడింది. జూలై 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.173 నుంచి రూ.184 వరకు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,930 కి చేరింది. అయితే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు విమాన ఇంధనం (ATF) ధర కూడా లీటరుకు రూ.5 తగ్గి రూ.110 కి చేరుకుంది. రాబోయే రోజుల్లో ఇంధన ధరల తగ్గింపు వల్ల రవాణా ఖర్చులు తగ్గి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.