LPG Ship : హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్ ఉన్నా సేఫ్.. ఖతర్ నుంచి 20 వేల టన్నుల ఎల్‌పీజీతో వచ్చిన షిప్

ఖతర్ నుంచి 20 వేల టన్నుల ఎల్‌పీజీతో వచ్చిన షిప్

Update: 2026-05-18 10:58 GMT

LPG Ship : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొన్న వేళ భారత్‌కు ఒక తీపి కబురు అందింది. కతర్ నుంచి భారీ ఎత్తున గ్యాస్‌ను మోసుకొస్తున్న ఓ నౌక క్షేమంగా భారత తీరానికి చేరుకుంది. సుమారు 20 వేల టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన ఈ నౌక, అత్యంత ప్రమాదకరంగా మారిన హోర్ముజ్ జలసంధిని దాటుకుని గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మార్షల్ ఐలాండ్ దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ సిమీ అనే నౌక ఖతర్ నుంచి బయలుదేరింది. ఈ నౌక మే 13న ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో గుజరాత్‌లోని దీన్ దయాళ్ పోర్టు (కాండ్లా)కు ఈ నౌక క్షేమంగా వచ్చి చేరింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న తరుణంలో ఈ గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా రావడం భారత్ ఇంధన భద్రతకు ఎంతో కీలకం.

ఓమన్ తీరానికి దగ్గరగా ఉండే ఈ హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, గ్యాస్‌లో సుమారు 20 శాతం కేవలం ఈ ఇరుకైన మార్గం గుండానే వెళ్లాలి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు జరుగుతాయేమోనన్న భయం పెరిగింది. ఈ మధ్యే ఓమన్ తీరంలో ఒక భారతీయ నౌకపై దాడి జరిగినప్పటికీ, భారత నౌకాదళం, అంతర్జాతీయ దళాల పహారాతో సరఫరాను కొనసాగిస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం.. మార్చి నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 13 భారతీయ నౌకలు ఈ ప్రమాదకరమైన హోర్ముజ్ మార్గం గుండా ప్రయాణించాయి. వీటిలో 12 ఎల్‌పీజీ ట్యాంకర్లు కాగా, ఒకటి ముడి చమురు నౌక. భారత్ తన అవసరాలకు కావాల్సిన చమురులో సింహభాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, ఈ సముద్ర మార్గం మనకు ప్రాణప్రదం. అందుకే ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్ తన గళాన్ని వినిపించింది. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించడం, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.

ఇటీవల ఓమన్ తీరంలో భారత జెండాతో ఉన్న నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినప్పుడు, ఓమన్ అధికారులు సకాలంలో స్పందించి 14 మంది సిబ్బందిని కాపాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత నౌకాదళం కూడా హిందూ మహాసముద్రం మరియు గల్ఫ్ ప్రాంతంలో తన నిఘాను పెంచింది. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండాలంటే ఈ సరఫరా గొలుసు చెక్కుచెదరకుండా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతానికి 20 వేల టన్నుల గ్యాస్ రావడంతో దేశంలో ఎల్‌పీజీ నిల్వలకు ఊరట లభించినట్లయింది.

Tags:    

Similar News