Gold Price : బంగారం కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. ఈ వారం పసిడి ధరల్లో భారీ మార్పులు
ఈ వారం పసిడి ధరల్లో భారీ మార్పులు
Gold Price : బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకునే వారికి అలాగే బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన గమనిక. ఈ వారం అంతర్జాతీయంగా జరగబోయే కొన్ని కీలక పరిణామాలు బంగారం, వెండి ధరల దిశను శాసించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాల సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలలో పురోగతి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒడిదుడుకులు పసిడి రేట్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్ ఒక పరిమిత పరిధిలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
గ్లోబల్ బ్యాంకుల సమావేశాలపైనే ఇన్వెస్టర్ల కన్ను
రాబోయే వారంలో ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే మూడు ముఖ్యమైన బ్యాంకుల సమావేశాలు జరగనున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ల వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు బ్రిటన్, జర్మనీ, జపాన్, యూరో జోన్ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సూచికలు మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అమెరికా-ఇరాన్ ఒప్పందం అతిపెద్ద ఫ్యాక్టర్
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందం బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేయనుంది. జేఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి ప్రణవ్ మెర్ విశ్లేషణ ప్రకారం.. ఒకవేళ అమెరికా-ఇరాన్ ఒప్పందం విజయవంతంగా ముగిసి, సంతకాలు జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో రిస్క్ తీసుకునే ప్రవృత్తి పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ అయిన బంగారం వైపు కాకుండా స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా పసిడి ధరలు తగ్గుతాయి. అయితే, మళ్లీ ఏవైనా కొత్త ఉద్రిక్తతలు తలెత్తితే మాత్రం ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుడు ధరలు పెరుగుతాయి.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం
గడిచిన వారంలో దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు గట్టిగా దెబ్బతిన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర ఏకంగా 5,066 రూపాయలు (3.2 శాతం) తగ్గి, ప్రతి 10 గ్రాములకు దాదాపు 1.50 లక్షల రూపాయల వద్ద ముగిసింది. అలాగే, జూలై డెలివరీ వెండి ఫ్యూచర్స్ ధర కూడా రూ. 2,351 (1 శాతం) క్షీణించి కిలో 2.46 లక్షల రూపాయల వద్ద స్థిరపడింది. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపిన వివరాల ప్రకారం, వారంలో ఒకానొక దశలో బంగారం ధరలు మరింత పతనమై రూ. 1.48 లక్షల స్థాయికి కూడా పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ అదే ఒత్తిడి
దేశీయ మార్కెట్లతో పాటే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడిపై విపరీతమైన ఒత్తిడి కనిపించింది. కామెక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర వారంలో 126.5 డాలర్లు (దాదాపు 3 శాతం) పడిపోయి ఔన్స్‌కు 4,238.8 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. వెండి ధర కూడా 1.13 డాలర్లు (1.6 శాతం) తగ్గి ఔన్స్‌కు 67.97 డాలర్ల వద్ద ముగిసింది. వారం ప్రారంభంలో ఇంధన మార్కెట్ ఆందోళనలు తగ్గడం, అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి వల్ల ధరలు తగ్గినప్పటికీ, ఇరాన్‌పై తక్షణ సైనిక చర్యలు ఉండవనే వార్తలతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి సురక్షిత పెట్టుబడిగా బంగారం డిమాండ్ కొంత మేర స్థిరపడింది. రాబోయే రోజుల్లో పశ్చిమ ఆసియా భౌగోళిక పరిస్థితులే పసిడి భవిష్యత్తును తేల్చనున్నాయి.