Medicine Prices : గుడ్ న్యూస్.. త్వరలో క్యాన్సర్, షుగర్ మందులతో సహా 200ఔషధాల ధరల తగ్గుతున్నాయ్
200ఔషధాల ధరల తగ్గుతున్నాయ్;
Medicine Prices : సామాన్యులకు గుడ్ న్యూస్. త్వరలో దేశంలో మందుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దాదాపు 200 ముఖ్యమైన మందులు, వాటిని తయారు చేసేందుకు ఉపయోగించే ముడి పదార్థాలపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఈ కమిటీ సూచించింది. ఈ సిఫార్సు గనుక అమలైతే, ఆయా మందుల ధరలు తగ్గి, చికిత్స ఖర్చులు కూడా తగ్గుతాయి. వాస్తవానికి మందుల ధరలను అదుపులో ఉంచడానికి, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మార్చడానికి ఈ చర్య తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారతదేశం అనేక ముఖ్యమైన మందులు, వాటిని తయారు చేసే ముడి పదార్థాల కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడుతోంది. ఈ వస్తువులను విదేశాల నుండి దిగుమతి చేసుకున్నప్పుడు, వాటిపై దిగుమతి సుంకం పడుతుంది. దీనివల్ల మందుల ధరలు పెరుగుతాయి.
ఈ ప్యానెల్ చేసిన సిఫార్సు ప్రకారం, మందుల ముడి పదార్థాలపై పన్నును తగ్గిస్తే, తయారీ కంపెనీలకు ఆ పదార్థాలు చౌకగా లభిస్తాయి. దీని వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, ఆ ప్రయోజనం నేరుగా రోగులకు అందుతుంది. అంటే, మందులు తక్కువ ధరకు లభిస్తాయి. ఇది దేశంలోని కోట్లాది మంది రోగులకు పెద్ద ఊరటనిస్తుంది. అంతేకాకుండా, భారతదేశంలో మందులు తయారు చేసే కంపెనీల ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ చర్య ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులపై దృష్టి సారించింది. ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపితే, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ప్రజలకు సరసమైన ధరలకు మందులు అందుబాటులోకి వస్తాయి. ప్యానెల్ సిఫార్సు చేసిన లిస్ట్‌లో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. 5% కస్టమ్స్ డ్యూటీ విధించబడే లిస్ట్‌లో 74 మందులు ఉన్నాయి. పూర్తిగా సుంకం రద్దు చేయబడిన లిస్ట్‌లో 69 మందులు ఉన్నాయి.
అంతేకాకుండా, అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 56 మందులకు కూడా కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్యానెల్ సూచించింది. ఇందులో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, గౌచర్ డిసీజ్, ఫాబ్రి డిసీజ్, లైసోసోమల్ స్టోరేజ్ డిజార్డర్, వంశపారంపర్య ఎంజైమ్ లోపం వంటి వ్యాధులకు వాడే మందులు ఉన్నాయి. వీటిలో కొన్ని మందులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వాటి ఒక కోర్సు చికిత్సకు కోట్లలో ఖర్చవుతుంది. ఈ చర్య వల్ల అలాంటి రోగులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.