Sugar Exports Ban : మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై విదేశాలకు ఒక్క కిలో చక్కెర కూడా వెళ్లదు
ఇకపై విదేశాలకు ఒక్క కిలో చక్కెర కూడా వెళ్లదు
Sugar Exports Ban : దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరల సెగ సామాన్యుడి వంటింటికి తాకకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులపై తక్షణమే అమల్లోకి వచ్చేలా సంపూర్ణ నిషేధాన్ని విధించింది. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30, 2026 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే పండుగ సీజన్లలో చక్కెర ధరలు సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎగుమతులు ఆపడానికి అసలు కారణం ఇదే
భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉంది. అల్ నినో ప్రభావం వల్ల వర్షపాతంపై అనిశ్చితి నెలకొనడం, ప్రధాన రాష్ట్రాల్లో చెరకు దిగుబడి తగ్గుతుందనే ఆందోళనల నేపథ్యంలో దేశీయంగా నిల్వలను కాపాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశ అవసరాలకు సరిపడా చక్కెర ఉండటమే కాకుండా, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా చక్కెర నిల్వలు చాలా అవసరం. ఎగుమతులను ఆపడం వల్ల దేశీయంగా సరఫరా పెరిగి ధరలు నియంత్రణలోకి వస్తాయి.
కుప్పకూలిన షుగర్ కంపెనీల షేర్లు
ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో చక్కెర కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్‌లో ధాంపూర్ షుగర్ మిల్స్, ద్వారికేష్ షుగర్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 7 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ హిందుస్థాన్, ఉత్తమ్ షుగర్ మిల్స్ షేర్లు కూడా భారీగా పతనమై ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. అయితే చక్కెర రంగం నష్టాల్లో ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా సెన్సెక్స్ 522 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి మార్కెట్ సానుకూలంగా ముగిసింది.
ప్రపంచ మార్కెట్‌లో చక్కెర కరువు?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఎగుమతులను నిలిపివేయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మన దేశం నుంచి చక్కెరను దిగుమతి చేసుకునే బంగ్లాదేశ్, శ్రీలంక, సూడాన్, లిబియా వంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వారు ఇప్పుడు బ్రెజిల్ లేదా థాయ్‌లాండ్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ విజ్ఞప్తి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.75 వద్దకు పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఒకవైపు చక్కెర ఎగుమతులు ఆపడంతో పాటు, మరోవైపు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దేశ ఆర్థిక స్థితి స్థిరపడే వరకు కనీసం ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.