Import Ban : విదేశీ వస్తువులపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్.. అనవసర దిగుమతులకు బ్రేక్ వేసేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్
అనవసర దిగుమతులకు బ్రేక్ వేసేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్
Import Ban : అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో పాటు దేశీయంగా పెరుగుతున్న భారీ వ్యాపార లోటుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. దేశ సంపదను కాపాడుకునేందుకు వీలుగా.. మనకు అవసరం లేని, నిత్యావసరాలు కాని విదేశీ వస్తువుల దిగుమతులపై కఠిన నిబంధనలు లేదా భారీగా పన్నులు విధించేందుకు ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మన భారతదేశంలోనే సులభంగా తయారు చేసుకోగలిగే అనవసర విదేశీ వస్తువులను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడం ద్వారా.. రూపాయికి బలాన్ని ఇవ్వడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రాణం పోయడమే ఈ సరికొత్త మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
ట్రేడ్ డెఫిసిట్ ఎగబాకడంతో కేంద్రం అలర్ట్
కరెన్సీ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 96.50 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు సోమవారం ఇది 96.34 వద్ద ముగిసింది. రూపాయి ఇలా బలహీనపడటం వల్ల దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే భారతదేశ వ్యాపార లోటు ఏకంగా 28.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంతకుముందు మార్చి నెలలో కేవలం 20.7 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. విదేశీ పెట్టుబడులు మందగించడం, దేశం నుంచి డబ్బు విపరీతంగా బయటకు వెళ్తుండటంతో బాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇలాగే వదిలేస్తే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై ధరల భారం పడే ప్రమాదం ఉంది.
వచ్చే వారమే హై-లెవల్ మీటింగ్
ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారమే ఒక అత్యున్నత స్థాయి అంతర-మంత్రిత్వ శాఖల సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ కీలక భేటీలో ఆర్థిక, వాణిజ్య, మౌలిక సదుపాయాల శాఖలకు చెందిన టాప్ అధికారులు పాల్గొననున్నారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో.. దిగుమతుల బిల్లును తగ్గించి, దేశీయ ఆదాయాన్ని ఎలా పెంచాలనే దానిపై తీవ్రంగా చర్చించనున్నారు. మన దేశంలోనే పుష్కలంగా లభించే ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. చాలా కంపెనీలు చౌకగా వస్తున్నాయనే నెపంతో నాసిరకం విదేశీ వస్తువులను ఇక్కడికి దిగుమతి చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే వాటిపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచడం లేదా కొన్ని వస్తువుల ఎంట్రీని పూర్తిగా బ్యాన్ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
చౌక విదేశీ వస్తువులకు చెక్..
కేంద్ర ప్రభుత్వ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ వస్తువైనా మన దేశంలోనే తయారవుతున్నప్పుడు, దాన్ని విదేశాల నుంచి కొని మన దేశ డాలర్లను బయటకు పంపడం ఎందుకు? అనేదే ప్రభుత్వ లాజిక్. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా దేశీయ ఇంపోర్టర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక మార్కెట్లో దొరికే వస్తువులను విదేశాల నుంచి తీసుకురావడం మానేసి, వాటిని ఇక్కడే తయారు చేసే మార్గాలను అన్వేషించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే చౌకైన, నాణ్యత లేని వస్తువులను అడ్డుకోవడానికి అన్ని మంత్రిత్వ శాఖలను ఒక సమగ్రమైన జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఈ ప్లాన్‌లో భాగంగానే గత వారం బంగారం దిగుమతి బిల్లును తగ్గించేందుకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన విషయం తెలిసిందే.
సప్లై చైన్ దెబ్బతినకుండా స్మార్ట్ ప్లాన్
అయితే ఈ ఆంక్షలు ఏవీ రాత్రికి రాత్రే అనాలోచితంగా అమలు చేయబోరని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. చాలా పక్కాగా, ఒక టైమ్ లైన్ నిర్దేశించుకుని ఈ కొత్త రూల్స్ తీసుకువస్తారు. దేశీయ పరిశ్రమలకు అవసరమైన అత్యవసర ముడిసరుకులు లేదా క్రిటికల్ సప్లై చైన్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా అమలులోకి వస్తే.. భారతదేశంలోనే సొంతంగా వస్తువుల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది, దీనివల్ల దేశీయంగా లక్షలాది మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. మన రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ బలోపేతం అవుతుంది.