Health Insurance : ఇన్సూరెన్స్ కంపెనీల అరాచకానికి కోర్టు బ్రేక్.. తండ్రి పరువు తీసినందుకు కంపెనీకి షాక్

తండ్రి పరువు తీసినందుకు కంపెనీకి షాక్

Update: 2026-06-04 08:37 GMT

Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి, తీరా క్లైయిమ్ అడిగేసరికి ఏదో ఒక వంకతో తిరస్కరించే బీమా కంపెనీల వైఖరికి కన్స్యూమర్ కోర్టు గట్టి ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన తండ్రి వైద్య ఖర్చుల కోసం దాఖలు చేసిన క్లైయిమ్ను హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉందంటూ కట్టుకథలు అల్లి క్లైయిమ్ రిజెక్ట్ చేయడమే కాకుండా, ఏకంగా పాలసీని రద్దు చేసింది. దీనిపై సదరు యువకుడు వెనకడుగు వేయకుండా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించి ఘన విజయం సాధించాడు.

బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన తండ్రి ఆరోగ్యం కోసం 2019 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఓ హెల్త్ పాలసీని రెగ్యులర్‌గా రిన్యూవల్ చేస్తున్నాడు. 25 మార్చి 2024 నుంచి 24 మార్చి 2025 వరకు చెల్లుబాటయ్యే ఈ పాలసీ కోసం రూ.42,750 ప్రీమియం కూడా చెల్లించాడు. అయితే, 25 జూన్ 2024న వారి కుటుంబంలో ఒక ఘోర విషాదం జరిగింది. కొంతమంది బంధువులు, ఇతర వ్యక్తులు కలిసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తల్లిదండ్రులపై కత్తులు, ఇనుప రాడ్లతో ఘోరంగా దాడి చేశారు. ఈ దారుణమైన దాడిలో తల్లి అక్కడికక్కడే మరణించగా, తండ్రి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ప్రముఖ కాంటినెంటల్ హాస్పిటల్స్‎లో చేర్చారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి సుదీర్ఘ కాలం చికిత్స అందించగా మొత్తం రూ.10.17 లక్షల ఖర్చయింది.

వైద్య ఖర్చులు అంత భారీగా అవ్వడంతో బాధిత యువకుడు ఇన్సూరెన్స్ క్లైయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ హాస్పిటల్ వారు ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీలో ఆల్కహాల్ విత్‌డ్రావల్ సైకోసిస్ అని వైద్యులు ఒక నోట్ రాశారు. దీనిని ఆసరాగా చేసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఓ కంపెనీ.. పాలసీదారుడు తనకు మద్యం తాగే అలవాటు ఉందన్న నిజాన్ని దాచాడని, అందుకే క్లైయిమ్ ఇవ్వడం కుదరదని అడ్డగోలుగా తిరస్కరించింది. అయితే తన తండ్రికి అసలు మద్యం ముట్టే అలవాటే లేదని కొడుకు నెత్తీనోరూ బాదుకున్నా కంపెనీ వినలేదు. ఆ తర్వాత బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు కూడా ఆయనకున్న గందరగోళ పరిస్థితి మద్యం వల్ల వచ్చింది కాదని, తీవ్రమైన కిడ్నీ వ్యాధి, అనీమియా, దాడి కారణంగా జరిగిన శారీరక, మానసిక గాయం వల్లే అలా జరిగిందని లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. అనంతరం హాస్పిటల్ కూడా తన తప్పు తెలుసుకుని డిశ్చార్జ్ సమ్మరీని సవరించి ఆ వ్యాఖ్యను తొలగించింది.

డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం తమ తప్పును ఒప్పుకుంటూ రాతపూర్వక వివరణ ఇచ్చినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బీమా సంస్థ మాత్రం తన మొండివైఖరిని వీడలేదు. దీంతో కన్స్యూమర్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి బీమా సంస్థ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టింది. కేవలం ప్రాథమిక రిపోర్టును పట్టుకుని, తదుపరి వైద్యుల వివరణలను పట్టించుకోకపోవడం బీమా సంస్థ సేవా లోపానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కోర్టు పేర్కొంది. అలాగే ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా పేషెంట్ రికార్డులో మద్యం అలవాటు ఉందని రాసినందుకు కాంటినెంటల్ హాస్పిటల్‌ను కూడా నిర్లక్ష్యపు దోషిగా తేల్చింది.

వినియోగదారుల ఫోరమ్ బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఓ కంపెనీ బాధితుడికి రూ. 6 లక్షల మెడికల్ క్లైయిమ్ మొత్తాన్ని, దరఖాస్తు చేసిన తేదీ నుంచి 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు, తప్పుడు రిపోర్టు రాసి మానసిక క్షోభకు గురిచేసినందుకు గాను కాంటినెంటల్ హాస్పిటల్ బాధితుడికి రూ. లక్ష పరిహారంతో పాటు, కోర్టు కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.25,000 చెల్లించాలని స్పష్టం చేసింది. బీమా కంపెనీలు కేవలం అంచనాలతో క్లైయిమ్లు తిరస్కరించలేవని, సరైన ఆధారాలు ఉంటే వినియోగదారులు కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని ఈ తీర్పు నిరూపించింది.

Tags:    

Similar News