FD Rates 2026 : సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్: 5 ఏళ్ల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే
అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే
FD Rates 2026 : రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్లకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన రాబడిని ఇచ్చే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు మొదటి స్థానంలో ఉంటాయి. ప్రతి నెల లేదా ప్రతి ఏడాది స్థిరమైన ఆదాయం కోరుకునే పెద్దలకు ఎఫ్‌డీలు మంచి భరోసానిస్తాయి. అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్లను అందించవు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మధ్య ఈ వడ్డీ రేట్లలో గణనీయమైన తేడా ఉంటుంది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో డిసిబి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకుల్లో కెల్లా అత్యధికంగా 8.00% వడ్డీని అందిస్తూ మొదటి స్థానంలో నిలవగా, ఎస్బీఎమ్ బ్యాంక్ ఇండియా, యెస్ బ్యాంక్ 7.50% వరకు వడ్డీని ఇస్తున్నాయి. అలాగే జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 7.35%, యాక్సిస్ బ్యాంక్ 7.25%, ఆర్బీఎల్ బ్యాంక్ తో పాటు తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంకులు 7.20% వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల అధిక రాబడిని ఆశించే సీనియర్ సిటిజన్లు ప్రైవేట్ బ్యాంకుల వైపు మొగ్గు చూపడం మంచి ఎంపిక కావచ్చు.
మరోవైపు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే స్వల్పంగా తక్కువగా ఉన్నాయి. 5 ఏళ్ల ఎఫ్‌డీలపై ప్రభుత్వ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 7.05% వడ్డీ రేటును అందిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.90%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.85%, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కెనరా బ్యాంకులు 6.75% వడ్డీని అందిస్తున్నాయి; ఇతర ప్రభుత్వ బ్యాంకులు దాదాపు 6.50% నుంచి 6.60% మధ్య వడ్డీని ఇస్తున్నాయి. ఇక 3 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలను పరిశీలిస్తే, ప్రైవేట్ విభాగంలో బంధన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.75% వరకు వడ్డీని అందిస్తుండగా, ఆర్బీఎల్ బ్యాంక్ 7.70%, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఎమ్ బ్యాంకులు 7.60% ఇస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ బ్యాంకుల్లో 3 ఏళ్ల ఎఫ్‌డీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 7.45% వడ్డీని ఇస్తుండగా, పిఎన్బి, ఎస్బీఐ 6.80%, బ్యాంక్ ఆఫ్ బరోడా , కెనరా బ్యాంకులు 6.75% వడ్డీని అందిస్తున్నాయి.
అయితే, కేవలం ఎక్కువ వడ్డీ రేటు ఉందనే కారణంతో మాత్రమే మొత్తం డబ్బును ఒకే బ్యాంకులో డిపాజిట్ చేయడం సరికాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.. మొదటిది బ్యాంకు నమ్మకత్వం, డిఐసిజిసి ఇన్సూరెన్స్ పరిధిలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతీ బ్యాంకు డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు భద్రత ఉంటుంది. రెండోది అకాల విత్‌డ్రా నిబంధనలు, అనగా అత్యవసర పరిస్థితుల్లో కాలపరిమితి ముగియక ముందే ఎఫ్‌డీని రద్దు చేస్తే ఎంత పెనాల్టీ పడుతుందో ముందే సరిచూసుకోవాలి. మూడోది పన్ను నిబంధనలు, ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15H సమర్పించడం ద్వారా వర్తించే మినహాయింపులను పొందవచ్చు. చివరగా డైవర్సిఫికేషన్ లేదా డిపాజిట్ల విభజన చేయడం మంచిది. పెట్టుబడి మొత్తం పెద్దదిగా ఉంటే దానిని ఒకే బ్యాంకులో ఉంచకుండా 2-3 రకాల బ్యాంకుల్లో పంచుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు.