Income Tax : నగదు లావాదేవీలు చేస్తున్నారా? పరిమితి దాటితే 100 శాతం జరిమానా విధించనున్న ఐటీ శాఖ
ఐటీ శాఖ
Income Tax : ప్రస్తుత డిజిటల్ పేమెంట్ల యుగంలో కూడా భారతదేశంలో నగదు చలామణి పూర్తిగా తగ్గిపోలేదు. రోజువారీ కిరాణా సామానుల కొనుగోలు దగ్గర నుంచి కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వరకు చాలా మంది ఇప్పటికీ నగదు రూపంలోనే లావాదేవీలు జరపడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలా పరిమితికి మించి నగదును వాడటం మీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా మారవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మనీలాండరింగ్, నల్లధనాన్ని అరికట్టేందుకు నగదు వినియోగంపై ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ రూల్స్ తెలియక చాలా మంది సామాన్యులు, వ్యాపారస్తులు ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు, భారీ జరిమానాల బారిన పడుతున్నారు. ప్రముఖ టాక్స్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల ప్రకారం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 8 ముఖ్యమైన నగదు నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.
ఒక్క రోజులో రూ.2 లక్షలకు మించి నగదు తీసుకుంటే భారీ పెనాల్టీ
మొదటి మరియు అత్యంత ముఖ్యమైన నిబంధన నగదు స్వీకరణకు సంబంధించింది. ప్రస్తుత ఐటీ చట్టాల ప్రకారం.. మీరు ఏ ఒక్క వ్యక్తి నుంచి అయినా సరే, ఒకే రోజులో లేదా ఏదైనా ఒక నిర్దిష్ట కార్యక్రమం (ఉదాహరణకు పెళ్లిళ్లు లేదా ఇతర ఈవెంట్లు) కోసం రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోకూడదు. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ తీసుకుంటే, ఆదాయపు పన్ను శాఖ వారు తీసుకున్న మొత్తం సొమ్ముకు సమానమైన (100 శాతం) జరిమానాను విధిస్తుంది. అంటే మీరు రూ.2.5 లక్షలు నగదుగా తీసుకుంటే, ఆ మొత్తం సొమ్మునూ పెనాల్టీ రూపంలోనే ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది.
అప్పులు ఇవ్వాలన్నా.. తీర్చాలన్నా రూ.20 వేల రూల్ గుర్తుంచుకోండి
వ్యక్తిగత అవసరాల కోసం స్నేహితులు లేదా బంధువుల దగ్గర అప్పులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టం ప్రకారం.. ఎవరి దగ్గర నుంచి అయినా సరే లోన్ లేదా డిపాజిట్ల రూపంలో రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదుగా తీసుకోకూడదు. ఒకవేళ మీకు 20 వేల కంటే ఎక్కువ డబ్బు అవసరమైతే, దానిని కేవలం బ్యాంక్ అకౌంట్ బదిలీ (NEFT/IMPS) లేదా చెక్కుల ద్వారా మాత్రమే తీసుకోవాలి. ఇదే నిబంధన తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేటప్పుడు కూడా వర్తిస్తుంది. మీరు ఎవరికైనా రూ.20,000 లేదా ఆ పైన అప్పు తీర్చాలనుకుంటే నగదు రూపంలో ఇవ్వకూడదు, కేవలం బ్యాంకింగ్ ఛానెల్స్ మాత్రమే ఉపయోగించాలి. లేదంటే ఐటీ నిబంధనల ప్రకారం భారీ శిక్షలు తప్పవు.
బిజినెస్ ఖర్చులు, చందాల చెల్లింపుల్లో కొత్త పరిమితులు ఇవే
మీరు ఒక వ్యాపారవేత్త అయితే, మీ బిజినెస్ ఖర్చుల కోసం ఒకే రోజులో ఒకే వ్యక్తికి రూ.10,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే, ఆ ఖర్చును మీ బిజినెస్ అకౌంట్స్‌లో టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీ శాఖ అంగీకరించదు. అయితే, రవాణా లేదా గూడ్స్ క్యారేజ్ వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం ఈ పరిమితి రూ.35,000 వరకు ఉంది. ఇకపోతే, చాలా మంది పన్ను ఆదా చేసుకోవడానికి (సెక్షన్ 80G కింద) వివిధ ట్రస్టులకు లేదా సంస్థలకు విరాళాలు (డొనేషన్లు) ఇస్తుంటారు. ఒకవేళ మీరు ఇచ్చే చందా లేదా విరాళం రూ.2,000 దాటితే, దానిని పొరపాటున కూడా నగదు రూపంలో ఇవ్వకండి. రూ.2 వేల కంటే ఎక్కువ నగదుగా ఇస్తే మీకు ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు.
ఇల్లు, స్థలం కొంటున్నారా?
రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణంగా నగదు రూపంలో పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇస్తుంటారు. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 269SS ప్రకారం.. ఏదైనా ఇల్లు, ఫ్లాట్ లేదా భూమి కొనుగోలు చేసే సమయంలో రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ లేదా టోకెన్ అమౌంట్‌గా నగదు రూపంలో ఇవ్వడం చట్టవిరుద్ధం. స్థిరాస్తి లావాదేవీలలో ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఐటీ శాఖ అత్యంత కఠినమైన జరిమానాలు విధిస్తుంది. కాబట్టి ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో ఎంత చిన్న మొత్తమైనా ఆన్‌లైన్ పేమెంట్లు లేదా చెక్కుల రూపంలో చేయడం సురక్షితం. అలాగే, మీ సొంత బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసినప్పుడు కూడా ఆ సమాచారం నేరుగా ఐటీ శాఖకు వెళ్తుంది. నిర్దేశిత పరిమితి దాటితే సెక్షన్ 194N కింద బ్యాంకులు సదరు మొత్తంపై టీడీఎస్ కట్ చేస్తాయి.
పెద్ద మొత్తాన్ని చిన్న భాగాలుగా మార్చి చెల్లిస్తున్నారా?
చాలా మంది ఐటీ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి ఒకే పెద్ద లావాదేవీని రికార్డుల్లో వేర్వేరు తేదీలలో చిన్న చిన్న మొత్తాలుగా మార్చి చూపిస్తుంటారు. ఉదాహరణకు ఒకే వ్యక్తికి ఇవ్వాల్సిన రూ.3 లక్షలను, రోజుకు రూ.50 వేల చొప్పున ఆరు సార్లు ఇచ్చినట్లు చూపిస్తారు. కానీ, ఆదాయపు పన్ను శాఖ స్కృటినీ చేసినప్పుడు ఆ లావాదేవీలన్నీ ఒకే ఒప్పందానికి లేదా ఒకే కార్యక్రమానికి సంబంధించినవని తేలితే, వాటన్నింటినీ కలిపి ఒకే లావాదేవీగా పరిగణిస్తారు. ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించి దొరికిపోతే ఐటీ శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తి మొత్తాన్ని అక్రమ లావాదేవీగా గుర్తించి వంద శాతం పెనాల్టీ వసూలు చేస్తుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో వీలైనంత వరకు డిజిటల్ పద్ధతులనే పాటించడం ఉత్తమం.