Income Tax Alert : పెన్షనర్లకు అలర్ట్.. ఒక్క చిన్న తప్పు చేస్తే ఐటీ నోటీస్ గ్యారెంటీ

ఒక్క చిన్న తప్పు చేస్తే ఐటీ నోటీస్ గ్యారెంటీ

Update: 2026-06-02 05:20 GMT

Income Tax Alert : దేశంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సీజన్ వచ్చేసింది. అయితే రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ పొందే వ్యక్తులు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రెండింటినీ ఒకేలా భావించి టాక్స్ లెక్కించడంలో పెద్ద తప్పులు చేస్తుంటారు. దీనివల్ల టాక్స్ కాలిక్యులేషన్ తారుమారై ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు రావడం, రీఫండ్స్ ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అసలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్లపై ఎలాంటి రూల్స్ ఉన్నాయి? వేటిపై ఎంత మినహాయింపు లభిస్తుందో తెలుసుకుందాం.

సాధారణ పెన్షన్‌ను జీతంగానే గుర్తిస్తారు

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పొందే రెగ్యులర్ పెన్షన్‌ను జీతం కిందనే లెక్కిస్తారు. పూర్వపు యాజమాన్యం తన ఉద్యోగికి ఇచ్చే మొత్తం కావడం వల్ల దీనిని ఉద్యోగి-యజమాని సంబంధంగా భావిస్తారు. అందువల్ల ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు సాధారణ పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్ కిందనే చూపించాల్సి ఉంటుంది.

రెగ్యులర్ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం

జీతం తీసుకునే ఉద్యోగుల లాగే రెగ్యులర్ పెన్షన్ పొందే వారికి కూడా ఇన్‌కమ్ టాక్స్ చట్టం కింద స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పాత పన్ను విధానంలో రూ.50,000 వరకు, కొత్త పన్ను విధానంలో ఏకంగా రూ.75,000 వరకు స్టాండర్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పెన్షన్ మొత్తం ఈ పరిమితుల కంటే తక్కువగా ఉండకూడదు.

ఫ్యామిలీ పెన్షన్‌కు వేరే రూల్స్ ఉంటాయ్

ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత.. వారి జీవిత భాగస్వామికి లేదా చట్టబద్ధమైన వారసులకు లభించే పెన్షన్‌ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. దీనిని ఆదాయపు పన్ను శాఖ జీతంగా పరిగణించదు. ఎందుకంటే డబ్బులు తీసుకునే వ్యక్తికి, సదరు సంస్థకు మధ్య ఎలాంటి ఉద్యోగ సంబంధం ఉండదు. కాబట్టి దీనిని ఐటీఆర్ లో ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా చూపించాలి.

ఫ్యామిలీ పెన్షనర్లకు లభించే ప్రత్యేక మినహాయింపులు

ఫ్యామిలీ పెన్షన్ పొందే వారికి సాధారణ స్టాండర్డ్ డిడక్షన్ లభించదు. కానీ వీరికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 57 కింద ప్రత్యేక మినహాయింపు ఇవ్వబడింది. దీని ప్రకారం.. పాత పన్ను విధానంలో ఫ్యామిలీ పెన్షన్ మొత్తంలో మూడో వంతు లేదా రూ.15,000.. వీటిలో ఏది తక్కువైతే అంత మొత్తం టాక్స్ ఫ్రీ అవుతుంది. అదే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే పెన్షన్ మొత్తంలో మూడో వంతు లేదా రూ.25,000 లలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్లకు అడ్వాన్స్ టాక్స్ నుంచి మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 207(2) ప్రకారం.. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దేశీయ సీనియర్ సిటిజన్లకు ముందస్తు పన్ను చెల్లించడం నుండి మినహాయింపు ఉంది. అయితే సదరు సీనియర్ సిటిజన్‌కు వ్యాపారం లేదా సొంత వృత్తి ద్వారా ఎలాంటి ఆదాయం రాకూడదు. కేవలం పెన్షన్ మరియు వడ్డీలపై వచ్చే ఆదాయం మాత్రమే ఉంటే.. వారు అడ్వాన్స్ టాక్స్ కట్టక్కర్లేదు, నేరుగా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడే తమ పన్ను మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.

75 ఏళ్లు దాటిన వారికి ఐటీఆర్ ఫైలింగ్ గోల లేదు

వయోవృద్ధులైన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 194P కింద ఐటీఆర్ ఫైలింగ్ నుంచి కూడా ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు కేవలం పెన్షన్, ఆ పెన్షన్ జమవుతున్న బ్యాంక్ ఖాతాలో వచ్చే వడ్డీ తప్ప వేరే ఏ ఇతర ఆదాయ మార్గాలు లేకపోతే వారు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం వారు తమ బ్యాంక్‌కు వెళ్లి ఫామ్ 12BBA సబ్మిట్ చేస్తే సరిపోతుంది, సదరు బ్యాంకే నేరుగా టాక్స్ లెక్కించి కట్ చేస్తుంది.

నోటీసులు రాకుండా నిపుణులు చెబుతున్న చిట్కాలు

అసెస్మెంట్ ఇయర్ 2026-27 కు సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసే ముందు పెన్షనర్లు అందరూ తమ వద్ద ఉన్న ఫామ్ 16, ఏఐఎస్, ఫామ్ 26ASలలో ఉన్న సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. మీ పెన్షన్ ఆదాయాన్ని సరైన పన్ను హెడ్ కింద చూపించడం వల్ల అనవసరమైన టాక్స్ వివాదాలు, ఐటీ నోటీసుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.

Tags:    

Similar News