Military Drone Deal : భారత సైన్యంలోకి డ్రోన్ల సునామీ.. ఏకంగా రూ. 17,000 కోట్లతో మెగా డీల్
ఏకంగా రూ. 17,000 కోట్లతో మెగా డీల్
Military Drone Deal : భారతదేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి, శత్రుదేశాల కుతంత్రాలకు అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమను ప్రోత్సహిస్తూనే, స్వదేశీ కంపెనీల నుంచి ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,000 కోట్లు) విలువైన అత్యాధునిక సైనిక డ్రోన్లను కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనకు త్వరలోనే అధికారిక ఆమోదం లభించనుంది. ఒకవేళ ఈ డీల్ ఖరారైతే, భారత రక్షణ రంగ చరిత్రలోనే ఇది అతిపెద్ద డ్రోన్ కొనుగోలు ఒప్పందంగా రికార్డు సృష్టిస్తుంది.
ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వేగంగా సరఫరా
రక్షణ రంగ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మెగా డ్రోన్ కొనుగోలు ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. సైన్యం అత్యవసర అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వం ఈ డీల్‌ను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేయాలని భావిస్తోంది. ఒప్పందం కుదిరిన తర్వాత కేవలం 18 నుంచి 24 నెలల లోపే ఈ అత్యాధునిక డ్రోన్ల సరఫరా భారత సైన్యానికి ప్రారంభం కానుంది. గతంలో భారత సైన్యం సుమారు రూ.3,000 కోట్ల విలువైన టాక్టికల్ డ్రోన్ల ఆర్డర్ ఇచ్చింది. అయితే, ప్రస్తుత డీల్ అంతకంటే చాలా రెట్లు పెద్దది కావడం విశేషం.
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల విశ్వరూపం
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, అలాగే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు కూడా యుద్ధభూమిలో ఎంతటి భారీ విధ్వంసాన్ని సృష్టించగలవో నిరూపించాయి. గత ఏడాది భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా ఇరు దేశాలు పెద్ద ఎత్తున డ్రోన్లను ఉపయోగించాయి. ఈ నేపథ్యంలోనే శత్రువుల లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి, గూఢచర్యానికి, అవసరమైనప్పుడు దాడులు చేయడానికి డ్రోన్ల అవసరం ఎంతో ఉందని భారత సైన్యం గుర్తించింది.
స్వదేశీ కంపెనీలకు, స్టార్టప్‌లకు మహర్దశ
ప్రస్తుతం భారతదేశంలో డ్రోన్లు, వాటి విడిభాగాలను తయారు చేసే కంపెనీలు 600కు పైగా ఉన్నాయి. ఇందులో సుమారు 100కి పైగా కంపెనీలు కేవలం రక్షణ రంగానికి అవసరమైన ప్రత్యేక డ్రోన్ల తయారీపైనే దృష్టి పెట్టాయి. ఈ లిస్టులో అదానీ గ్రూప్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఐడియాఫోర్జ్, న్యూస్పేస్ రీసెర్చ్, ఆస్టెరియా ఏరోస్పేస్ వంటి ప్రముఖ దిగ్గజ సంస్థలతో పాటు ఎన్నో సరికొత్త స్టార్టప్‌లు కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయే ఈ భారీ ఆర్డర్ల వల్ల ఈ కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ పాలసీకి అండగా ప్రభుత్వం
రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, భారతదేశాన్ని స్వయంసమృద్ధంగా (ఆత్మనిర్భర్) మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని ఏళ్లుగా సరికొత్త విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే రక్షణ కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసి, విదేశీ కంపెనీల కంటే భారతీయ కంపెనీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ వంటి పథకాల ద్వారా కొత్త స్టార్టప్‌లకు నిధులు, సాంకేతిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఈ ప్రతిపాదిత డ్రోన్ డీల్ విజయవంతమైతే భారత సైన్యం మరింత బలోపేతం అవ్వడమే కాకుండా, అంతర్జాతీయ రక్షణ మార్కెట్‌లో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.