Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ లాంటి ఎగ్జిక్యూటివ్ పాడ్స్ రెడీ
ఫ్లైట్ లాంటి ఎగ్జిక్యూటివ్ పాడ్స్ రెడీ
Indian Railways : భారతీయ రైల్వేలో ప్రయాణం అంటే ఒకప్పుడు కిక్కిరిసిన బోగీలు, అసౌకర్యాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఇకపై రైలు ప్రయాణంలోనూ మీరు విమానంలో వెళ్తున్న అనుభూతిని పొందవచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రైవేట్ క్యాబిన్లతో కూడిన కొత్త వ్యవస్థను ఇండియన్ రైల్వేస్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు భారతీయ రైల్వే కోసం ఒక అద్భుతమైన డిజైన్‌ను రూపొందించారు. దీని పేరు ప్రీమియం ఎగ్జిక్యూటివ్ పాడ్. సాధారణ బోగీలలా కాకుండా, ఇందులో ప్రతి ప్రయాణికుడికి ఒక చిన్న ప్రైవేట్ క్యాబిన్ (పాడ్) ఉంటుంది. ఇందులో కూర్చోవడమే కాదు, హాయిగా పడుకోవడానికి కూడా వీలుంటుంది. ముఖ్యంగా హై-స్పీడ్ రైళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్‌ను సిద్ధం చేశారు. రైల్వే డిజైన్ సెంటర్ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్, భవిష్యత్తులో రైల్వే ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనుంది.
ఈ కొత్త పాడ్స్‌లో ప్రయాణికులకు వ్యక్తిగత లైటింగ్, సామాన్ల కోసం ప్రత్యేక స్టోరేజ్ స్పేస్, ల్యాప్‌టాప్ పెట్టుకుని పనిచేసుకోవడానికి చిన్న వర్క్ స్టేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి. సీట్లను కూడా ఎర్గోనామిక్ పద్ధతిలో రూపొందించారు, అంటే ఎంత దూరం ప్రయాణించినా వెన్నునొప్పి రాకుండా, అలసట కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్, మెరుగైన కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం ఒక ప్రయాణంలా కాకుండా, ఒక లగ్జరీ అనుభవంలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఇది ఒక కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. అంటే విద్యార్థులు రూపొందించిన ఈ మోడల్‌ను రైల్వే అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనిని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఎంత ఖర్చవుతుంది? టెక్నికల్ గా ఇది ఎంతవరకు సాధ్యం? అనే విషయాలపై అధ్యయనం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే, మన వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ఇవి మొదటగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వే వేగంగా మారుతోంది. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లతో ఇప్పటికే ప్రయాణం వేగవంతమైంది. ఇప్పుడు సౌకర్యాల విషయంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ పాడ్ కాన్సెప్ట్ గనుక అమల్లోకి వస్తే, తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరంలా మారుతుంది. భవిష్యత్తులో పట్టాల మీద పరుగెత్తే ఈ మినీ విమానాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.