IndiGo : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లోనే రూ.2500 కోట్ల భారీ నష్టం

మూడు నెలల్లోనే రూ.2500 కోట్ల భారీ నష్టం

Update: 2026-05-30 08:39 GMT

IndiGo : దేశీయ విమానయాన రంగంలో అత్యంత పెద్ద వాటా కలిగి ఉన్న ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోకు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయంగా తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయంగా పెరిగిన నిర్వహణ ఖర్చులు ఇండిగో ఆటను పూర్తిగా మార్చేశాయి. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మే 29న ప్రకటించిన మార్చి 2026 త్రైమాసిక (క్యూ4) ఆర్థిక ఫలితాలలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన మూడు నెలల కాలంలో కంపెనీకి ఏకంగా 2,536 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.3,068 కోట్ల భారీ లాభాన్ని ఆర్జించగా.. ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయి నష్టాల ఊబిలోకి జారుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, విమాన ఇంధన ధరలు పెరగడం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం వంటి కారణాలు ఇండిగో లాభాలను దారుణంగా దెబ్బతీశాయి.

ఇండిగో సంస్థకు భారీ నష్టం వచ్చినప్పటికీ, కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో మాత్రం స్వల్ప వృద్ధి కనిపించింది. జనవరి-మార్చి 2026 క్వార్టర్‌లో ఇండిగో మొత్తం ఆదాయం గత ఏడాది రూ.22,152 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.22,438 కోట్లకు చేరింది. అయితే ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు అంతకుమించి ఉండటంతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింది. ఈ త్రైమాసికంలో కంపెనీపై దాదాపు రూ.250 కోట్ల మేర ఒకేసారి చెల్లించాల్సిన అదనపు ఖర్చులు కూడా పడ్డాయి. విమానాల లీజింగ్, ఇతర నిర్వహణ వ్యయాలు పెరగడం వల్ల ఆదాయం పెరిగినా లాభాలు రాకుండా పోయాయి.

ఈ భారీ నష్టాల నడుమ ఇండిగో బోర్డ్ ఒక కీలకమైన వ్యూహాత్మక నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీకి చెందిన అనుబంధ విభాగం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్(IFSC) ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఫైనాన్స్ లీజ్ బాధ్యతలను ముందుగానే పాక్షికంగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీనికోసం వివిధ విడతల్లో దాదాపు 450 మిలియన్ డాలర్ల వరకు మొత్తాన్ని కంపెనీ ముందస్తుగా చెల్లించనుంది. ఈ నిధులను సొంతంగా కొత్త విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, విడిభాగాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో లీజు ఖర్చులు తగ్గి, నిర్వహణ వ్యయాన్ని మరింత సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చని కంపెనీ భావిస్తోంది.

ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా ఈ ఆర్థిక ఫలితాలపై స్పందిస్తూ.. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం ఏవియేషన్ రంగానికి అత్యంత సవాలుతో కూడుకున్నదిగా నిలిచిందని చెప్పారు. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు ఇండస్ట్రీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని, అయినప్పటికీ ఇండిగో యొక్క ప్రధాన వ్యాపార పునాది చాలా బలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే తమ విమానాల సామర్థ్యం 9.5 శాతం పెరిగిందని, మొత్తం ఆదాయంలో 6 శాతం పైగా వృద్ధి నమోదైందని వివరించారు. విదేశీ మారక ద్రవ్యం హెచ్చుతగ్గులు, కొన్ని ప్రత్యేక ఖర్చులను పక్కనబెట్టి చూస్తే, కంపెనీ వార్షికంగా రూ.7,500 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించిందని ఆయన స్పష్టం చేశారు.

మార్చి త్రైమాసికంలో ఇండిగో తన విమాన సర్వీసుల సామర్థ్యాన్ని 3.4 శాతం పెంచినప్పటికీ.. మిడిల్ ఈస్ట్ రీజియన్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా ప్రభావితమయ్యాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే రూట్లలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రయాణికుల సంఖ్య 1.1 శాతం తగ్గి 3.16 కోట్లకు పడిపోయింది. అలాగే విమానాలలో సీట్ల లభ్యతను తెలిపే ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ కూడా 85.8 శాతానికి క్షీణించింది. ఈ నిరాశాజనక ఆర్థిక ఫలితాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ లోని ఇండిగో షేర్లపై నేరుగా పడింది. మే 29 నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 3 శాతం మేర నష్టపోయి రూ.4,420 వద్ద ముగిశాయి.

Tags:    

Similar News