Card Charges : విదేశాల్లో క్రెడిట్, డెబిట్ కార్డ్ వాడకం మరింత ప్రియం.. చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
Card Charges : విదేశాలకు ప్రయాణించే వారికి, విదేశీ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ప్రముఖ బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి జరిపే డైనామిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) లావాదేవీలపై ఫీజులను బ్యాంకులు భారీగా పెంచేశాయి. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తమ డెబిట్, క్రెడిట్ కార్డ్ కస్టమర్లపై ఈ భారాన్ని మోపాయి. విదేశాల్లో భారతీయ రూపాయిల్లో చెల్లింపులు చేసే క్రమంలో ఈ చార్జీలు వసూలు చేయబడతాయి.
ఏ బ్యాంక్ ఎంత చార్జ్ పెంచింది?
యాక్సిస్ బ్యాంక్ తమ మై జోన్, సెలెక్ట్, ప్రివిలేజ్, నియో క్రెడిట్ కార్డులపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ చార్జీలను 1.5 శాతం నుంచి ఏకంగా 3.5 శాతానికి పెంచింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఫీజును 1% + GST నుంచి 3.5% + GST కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. అంతకుముందే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా జూన్ 21న డెబిట్ కార్డులపై డిసిసి చార్జీలను 3.5% + GST కి పెంచిన సంగతి తెలిసిందే.
డిసిసి అంటే ఏమిటి?
విదేశాలకు వెళ్లినప్పుడు లేదా విదేశీ యాప్‌లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో షాపింగ్ చేసినప్పుడు అక్కడ కరెన్సీకి బదులుగా భారతీయ రూపాయిల్లో పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే దానిని డైనామిక్ కరెన్సీ కన్వర్షన్ అంటారు. ఈ విధానంలో మారకం ధరను విదేశీ మర్చంట్ లేదా వారి పేమెంట్ ప్రొవైడర్ నిర్ణయిస్తారు. దీనివల్ల కార్డులు జారీ చేసిన భారతీయ బ్యాంకులకు ఫారిన్ కరెన్సీ మార్కప్ ద్వారా రావాల్సిన రాబడి రాదు. క్రాస్ బార్డర్ ప్రాసెసింగ్ కాస్ట్, కార్డ్ నెట్‌వర్క్ ఫీజులను రికవర్ చేసుకోవడానికి, పెరుగుతున్న విదేశీ డిజిటల్ పేమెంట్ల నుంచి అదనపు ఆదాయం పొందడానికి బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డిసిసి చార్జీలు పెరిగిన నేపథ్యంలో విదేశాల్లో కార్డులు వాడేటప్పుడు భారతీయ రూపాయిల్లో పేమెంట్ చేసే బదులు ఆ దేశపు స్థానిక కరెన్సీలోనే చెల్లింపులు చేయడం కొంతవరకు మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక కరెన్సీ ఎంచుకున్నప్పుడు సాధారణ ఫారెక్స్ మార్కప్ మాత్రమే వర్తిస్తుంది. కానీ రూపాయిల్లో చెల్లిస్తే విదేశీ మర్చంట్ వేసే ఎక్స్చేంజ్ రేటుతో పాటు, భారతీయ బ్యాంక్ వేసే 3.5 శాతం ఫీజు, దానికి తోడు జిఎస్‌టి కూడా పడుతుంది. కాబట్టి విదేశాల్లో స్వైప్ చేసేటప్పుడు కరెన్సీ ఆప్షన్ జాగ్రత్తగా ఎంచుకోవడం శ్రేయస్కరం.