Rare Earth : ఏపీలో జపాన్ భారీ పెట్టుబడి.. రూ.2,250 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్ ప్లాంట్
రూ.2,250 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్ ప్లాంట్
Rare Earth : ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సప్లై చైన్ మార్కెట్లో చైనాకు ఉన్న ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు భారత్, జపాన్ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్‌ఫోన్లు, క్షిపణులు, మిలిటరీ ఫైటర్ జెట్లలో వాడే హై-టెక్ కాంపోనెంట్స్ తయారీ మార్కెట్లో చైనాదే పైచేయిగా ఉంది. ఈ క్రూషియల్ సెక్టార్ లో చైనాపై ఉన్న డిపెండెన్సీని తగ్గించడానికి, భారతదేశాన్ని ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక భారీ డీల్ కుదిరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రొటేరియల్ మెగా ఇన్వెస్ట్‌మెంట్
అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ తయారీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధ జపాన్ దిగ్గజ సంస్థ ప్రొటేరియల్ ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,250 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఏపీలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ ప్లాంట్‌ను కంపెనీ స్థాపించనుంది. దేశీయంగా బలమైన రేర్ ఎర్త్ వాల్యూ చైన్‌ను నిర్మించాలనే భారత ప్రభుత్వ ఆశయాలకు ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ గత వారం జరిగిన కీలక సమావేశంలో అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్లాంట్ స్థాపన
ఈ భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 1.2 కిలో టన్నుల సామర్థ్యంతో సింటెర్డ్ నియోడైమియం-ఐరన్-బోరాన్ (NdFeB) పర్మనెంట్ మాగ్నెట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇవి ఈవీ కార్ల మోటార్లు, విండ్ మిల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ సిస్టమ్స్ వంటి అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక రంగాలలో కీలక భాగాలుగా ఉపయోగపడతాయి. దీనివల్ల ఏపీ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, మాగ్నెటిక్ మార్కెట్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది.
భారత్ చైనా ప్లస్ వన్ వ్యూహం సక్సెస్
ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలన్నీ కేవలం చైనాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూసేలా చైనా ప్లస్ వన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. ఈ తరుణంలోనే రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల స్థానిక ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. ప్రొటేరియల్ సంస్థ (గతంలో దీనిని హిటాచీ మెటల్స్ అని పిలిచేవారు) NdFeB మాగ్నెట్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉంది. గత ఏడాది ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45,000 కోట్ల కన్సాలిడేటెడ్ రెవెన్యూను నమోదు చేసింది. నార్త్ అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ ఇప్పుడు ఏపీలో ప్లాంట్ పెట్టడం చైనాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.