Jewellery Insurance : బంగారం కొంటే సరిపోదు.. దానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకోండి
దానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకోండి
Jewellery Insurance : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది కుటుంబాల తరతరాల ఆస్తి, ఆర్థిక భరోసా. అయితే ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం ధర దాదాపు రూ.1.5 లక్షల మార్కుకు చేరువ కావడంతో, ఇంట్లో లేదా దుకాణాల్లో నగలను భద్రపరచడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఇంత విలువైన ఆస్తిని కాపాడుకోవడానికి కేవలం లాకర్లు మాత్రమే సరిపోవు, జ్యూయెలరీ ఇన్సూరెన్స్ అనే రక్షణ కవచం కూడా చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు తులం బంగారం రూ.50 వేలు ఉన్నప్పుడు దానిపై ఉన్న రిస్క్ వేరు, ఇప్పుడు రూ.1.5 లక్షలకు చేరినప్పుడు ఉన్న రిస్క్ వేరు. ధరలు పెరగడంతో దొంగలు, దోపిడీదారుల కన్ను ఇప్పుడు సామాన్యుల ఇళ్లపై పడుతోంది. కేవలం సాధారణ వినియోగదారులే కాదు, జ్వెలరీ వ్యాపారులు కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి స్టాక్ విలువ భారీగా పెరగడం వల్ల రవాణా సమయంలో గానీ, దుకాణంలో ఉన్నప్పుడు గానీ ఏదైనా అపశృతి జరిగితే కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఇంత జరుగుతున్నా మన దేశంలో జ్వెలరీ ఇన్సూరెన్స్ మార్కెట్ కేవలం రూ.250-500 కోట్ల స్థాయిలోనే ఉండటం విచారకరం.
ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వ్యాపారులు, సామాన్య కుటుంబాలు ఇన్సూరెన్స్‌ను ఒక అదనపు ఖర్చుగా భావిస్తారు. కానీ ఒక్కసారి దొంగతనం జరిగితే ఆ నష్టాన్ని భరించడం మధ్యతరగతి కుటుంబాలకు దాదాపు అసాధ్యం. దేశీయంగా జ్యూయెలరీ ఇండస్ట్రీ విలువ రూ.4.7 లక్షల కోట్లు ఉన్నప్పటికీ, ఇందులో చాలా కొద్ది మంది మాత్రమే బీమా రక్షణ పొందుతున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఖర్చు కాదు, అది మీ కష్టార్జితానికి ఇచ్చే గ్యారెంటీ అని గుర్తించాలి.
జ్యూయెలరీ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఈ బీమా పాలసీలు దొంగతనం, కన్నం వేయడం వంటి సాధారణ ప్రమాదాలనే కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.
* దుకాణదారుల కోసం: జ్యూయెలర్స్ బ్లాక్ ఇన్సూరెన్స్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, సొంత ఉద్యోగులు చేసే మోసాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
* రవాణా రక్షణ: నగలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లేటప్పుడు జరిగే దోపిడీలకు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
* వినియోగదారుల కోసం: ఇంట్లో దొంగతనం జరిగినా లేదా ఏదైనా ప్రమాదంలో నగలు పాడైపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ నష్టాన్ని భరిస్తాయి.
ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి?
మనం మన కారుకు, ఆరోగ్యానికి బీమా చేయించినట్టే.. మన ఆర్థిక మూలధనమైన బంగారానికి కూడా బీమా చేయించడం నేటి అవసరం. ఒక్కసారి నగలు పోతే వాటిని ప్రస్తుత ధరల వద్ద మళ్లీ కొనుగోలు చేయడం సామాన్యులకు పెను భారమే. అందుకే నామమాత్రపు ప్రీమియం చెల్లించి మీ బంగారాన్ని సురక్షితం చేసుకోవడం మేలైన నిర్ణయం. మీరు కొన్న ఆభరణానికి భావోద్వేగ విలువతో పాటు ఆర్థిక విలువ కూడా ఉంటుంది, దాన్ని కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ ఒక ధీమాగా నిలుస్తుంది.