LIC : ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. 22 లక్షల మందికి ఉచితంగా షేర్లు.. మీ దగ్గర ఒక్క షేరు ఉన్నా జాక్‌పాట్ ఖాయం

మీ దగ్గర ఒక్క షేరు ఉన్నా జాక్‌పాట్ ఖాయం

Update: 2026-04-15 06:05 GMT

LIC : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన వార్త చెప్పింది. సుమారు 22 లక్షల మంది వాటాదారులకు ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా బోనస్ షేర్లను ఇస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఎల్ఐసీ షేర్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేవు. ఎల్ఐసీ ప్రకటించిన ఈ బోనస్ ఇష్యూ ప్రకారం.. 1:1 రేషియోలో షేర్లను పంపిణీ చేయనున్నారు. అంటే, మీ దగ్గర ఎల్ఐసీ కంపెనీకి చెందిన ఒక షేరు ఉంటే, కంపెనీ మీకు మరో షేరును ఉచితంగా ఇస్తుంది. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీ వద్ద 100 షేర్లు ఉంటే, బోనస్ తర్వాత అవి 200 షేర్లుగా మారిపోతాయి. కంపెనీ తన దగ్గర ఉన్న రిజర్వ్ ఫండ్స్ లేదా లాభాలను ఇన్వెస్టర్లకు వాటా రూపంలో పంచడమే ఈ బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం.

ఈ బంపర్ ఆఫర్ కోసం ఎల్ఐసీ తన రిజర్వ్ నిధుల నుంచి సుమారు 6,325 కోట్ల రూపాయలను వినియోగించనుంది. కంపెనీ వద్ద సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల భారీ రిజర్వ్ నిధులు ఉన్నాయి. అందులో కొంత భాగాన్ని మూలధనంగా మార్చి ఇలా ఉచిత షేర్లను జారీ చేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కంపెనీ ఎంత ఆర్థిక బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ఎల్ఐసీ షేర్ల లభ్యత పెరగడమే కాకుండా, సామాన్య ఇన్వెస్టర్లకు కూడా తక్కువ ధరలో షేర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

మరి ఈ ఉచిత షేర్లు మీ అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి?

కంపెనీ సమాచారం ప్రకారం, బోర్డు ఆమోదం పొందిన రెండు నెలల లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే జూన్ 12వ తేదీ లోపు ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి ఈ బోనస్ షేర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి రికార్డ్ డేట్ ను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. ఆ నిర్దేశిత తేదీ నాటికి ఎవరి వద్దయితే ఎల్ఐసీ షేర్లు ఉంటాయో, వారు మాత్రమే ఈ అదనపు షేర్లను పొందేందుకు అర్హులు. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ దూకుడు చూస్తుంటే ఇన్వెస్టర్లకు మున్ముందు మరిన్ని లాభాలు అందేలా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News