Noel Tata : టాటా ట్రస్ట్స్‌లో మళ్లీ కలకలం..నోయెల్ టాటాకు నోటీసులు
నోయెల్ టాటాకు నోటీసులు
Noel Tata : భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో మళ్లీ వివాదాల ముళ్లు రాజుకున్నాయి. ఏకంగా 37 సంవత్సరాల క్రితం అంటే 1989లో జరిగిన ఓ షేర్ల బదిలీ వ్యవహారంలో మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఇప్పుడు నోయెల్ టాటాకు నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. నవాబ్‌బాయి రతన్ టాటా ట్రస్ట్ (NRTT) నుంచి దివంగత నవల్ హెచ్ టాటాకు టాటా సన్స్ సంస్థకు చెందిన 833 షేర్లను బదిలీ చేయడంపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఛారిటీ కమిషనర్ నోయెల్ టాటాను ఆదేశించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టాలా లేదా అనేది ఆయన ఇచ్చే సమాధానం, సమర్పించే ఆధారాలపైనే ఆధారపడి ఉంటుందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
ట్రస్టీల ఆరోపణలు.. అసలు వివాదం ఏంటి?
ఈ వ్యవహారంలో ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆస్తిని బేఖాతరు చేస్తూ, అక్రమ మార్గంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వంత వ్యక్తులకు కట్టబెట్టారని ట్రస్ట్ నిర్వాహకుల్లో ఒకరైన విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. నవల్ టాటా ట్రస్టీ పదవికి రాజీనామా చేసిన కేవలం ఒక వారానికే, అంటే జనవరి 18, 1989న ఈ షేర్ల బదిలీ ప్రక్రియ జరిగిందని లీగల్ నోటీసు ద్వారా వెల్లడించారు. ఛారిటీ కమిషనర్ సమక్షంలో దాఖలైన ఫిర్యాదు ప్రకారం.. ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా, ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం (Consideration) ట్రస్ట్‌కు చెల్లించకుండానే ఈ బదిలీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఛారిటీ కమిషనర్ కోరిన 5 కీలక ప్రశ్నలు
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన లేఖ ప్రకారం, నోయెల్ టాటా రాబోయే రెండు వారాల్లో ఐదు అంశాలపై స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది:
* ఆ నాడు షేర్లను బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
* ఈ లావాదేవీకి మద్దతుగా ఉన్న చట్టపరమైన ఆధారాలు మరియు పత్రాలు ఏవి?
* షేర్ల బదిలీకి ప్రతిఫలంగా ట్రస్ట్‌కు అసలు ఏమైనా పరిహారం లేదా నగదు అందిందా?
* ఈ షేర్ల వల్ల చివరికి నవల్ టాటా కుటుంబ సభ్యులు లబ్ధి పొందారా?
* నాటి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే ఈ బదిలీ జరిగిందా?
క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆందోళనలు, నియంత్రణ ఆంక్షలు
ఈ వ్యవహారంలో నోయెల్ టాటా నేరుగా నవల్ టాటా వారసుడు కావడంతో ఆయన ప్రయోజనాల సంఘర్షణ ఎదుర్కొంటున్నారని, అందుకే ఆయన ఈ నిర్ణయాలపై జోక్యం చేసుకోకూడదని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. ఇప్పటికే సరిగ్గా నియమావళి పాటించలేదనే ఆరోపణలతో సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT) కొత్త నిర్ణయాలు తీసుకోకుండా, సమావేశాలు నిర్వహించకుండా ఛారిటీ కమిషనర్ తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ తరుణంలో నోయెల్ టాటాకు వచ్చిన ఈ నోటీసులు గ్రూప్ మేనేజ్‌మెంట్‌లో కొత్త ఒత్తిళ్లను పెంచుతున్నాయి.
ఆరోపణలను ఖండించిన టాటా ట్రస్ట్స్
ఈ ఆరోపణలపై టాటా ట్రస్ట్స్ స్పందిస్తూ.. ఇవన్నీ పూర్తిగా ఆధారరహితమైనవి, దురుద్దేశపూర్వకమైనవని స్పష్టం చేసింది. నాటి షేర్ల బదిలీ పూర్తిగా చట్టబద్ధంగా, అప్పటి నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని తెలిపింది. ఆనాడు దేశంలోనే అత్యంత ప్రముఖ న్యాయకోవిదుడు దివంగత నాని ఎ. పాల్కీవాలా పర్యవేక్షణలో, టాటా సన్స్ బోర్డు ఆమోదంతోనే ఈ ప్రక్రియ పూర్తయిందని వివరించింది. ఆర్ఓసీ ముద్ర ఉన్న చెల్లుబాటు అయ్యే ఫామ్‌ల ద్వారానే బదిలీ జరిగిందని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది.