Jio IPO : భారీ ఐపీఓ వేళ రిలయన్స్ బిగ్ ప్లాన్.. జియో ప్లాట్‌ఫామ్స్ కొత్త సీఈఓగా పంకజ్ పవార్

సీఈఓగా పంకజ్ పవార్

Update: 2026-07-14 04:47 GMT

Jio IPO : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓకు వస్తున్న తరుణంలో కంపెనీ మేనేజ్‌మెంట్‌లో అత్యంత కీలకమైన మార్పులు చేపట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పంకజ్ పవార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న కిరణ్ థామస్ స్థానంలో పంకజ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఐపీఓ కోసం దాఖలు చేసిన ముసాయిదా పత్రాల ద్వారా ఈ సంచలన మార్పు వెలుగులోకి వచ్చింది. ఈ మెగా ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి ఏకంగా 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 37,700 కోట్లు) సమీకరించాలని జియో ప్లాన్‌ చేస్తోంది.

రెండు దశాబ్దాల రిలయన్స్ ప్రస్థానం

జియో ప్లాట్‌ఫామ్స్ బాధ్యతలు అందుకున్న 53 ఏళ్ల పంకజ్ మోహన్ పవార్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి రిలయన్స్ గ్రూప్‌తో ముడిపడి ఉన్న ఆయనకు పెద్ద ఎత్తున కస్టమర్ బేస్ ఉన్న డిజిటల్ సర్వీసెస్ వ్యాపారాలను నిర్మించడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. కిరణ్ థామస్ మార్చి 23న తన పదవికి రాజీనామా చేయగా, మార్చి 24న పంకజ్ పవార్ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం.

జియో బోర్డులో ఎవరెవరు ఉన్నారు?

ఐపీఓ కోసం సెబీకి సమర్పించిన దస్తావేజుల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డుకు చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. మనోజ్ హర్జీవందాస్ మోదీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఆకాష్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీలు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఈ ప్రతిష్టాత్మక బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అగ్రశ్రేణి నాయకత్వంలోనే జియో ఐపీఓ ప్రక్రియ ముందుకు సాగనుంది.

దేశంలోనే నెంబర్ 1 ఐపీఓగా నిలవనున్న జియో

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ద్వారా దాదాపు 27 కోట్ల కొత్త షేర్లను విక్రయించాలని యోచిస్తోంది. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో దాదాపు 2.9 శాతానికి సమానం. ఈ ఐపీఓ విజయవంతమైతే, గతంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలకొల్పిన రూ. 27,870 కోట్ల ఐపీఓ రికార్డును జియో సునాయాసంగా అధిగమించనుంది. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌లలో విస్తరించిన జియో ప్లాట్‌ఫామ్స్ విలువను మార్కెట్లో మరింత పెంచేందుకు ఈ ఐపీఓ ఎంతగానో దోహదపడనుంది. చైనా మొబైల్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్న జియోలో గూగుల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే కీలక పెట్టుబడిదారులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News