Melinda : మహిళల ఆరోగ్యం కోసం రూ.1,800 కోట్లు దానం.. ఎందరికో ఆదర్శంగా బిల్ గేట్స్ మాజీ భార్య
ఎందరికో ఆదర్శంగా బిల్ గేట్స్ మాజీ భార్య
Melinda : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఈ క్రేజ్ వల్ల టెక్ కంపెనీలలో పనిచేసే ఎంతోమంది రాత్రికి రాత్రే ఊహించని రీతిలో కోటీశ్వరులుగా మారిపోతున్నారు. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీల ఐపీఓల వల్ల కొత్త కోటీశ్వరుల సైన్యం తయారవుతుండగా.. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ లాంటి కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, దాత మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈ కొత్త టెక్ బిలియనీర్ల ముందు ఒక పెద్ద డిమాండ్‌ను ఉంచారు. వీరంతా తమ సంపాదనలో కనీసం సగం భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం దానం చేయాలని కోరారు.
ప్రముఖ ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలిండా గేట్స్ ఈ విషయాలను పంచుకున్నారు. రాబోయే రోజుల్లో టెక్ కంపెనీల ఐపీఓల ద్వారా భారీగా లాభాలు గడించబోయే వారికి ఆమె ఒక కీలకమైన సలహా ఇచ్చారు. దానం చేసే నిర్ణయాన్ని భవిష్యత్తుకు వాయిదా వేయకుండా.. ఇప్పుడే తీసుకోవాలని స్పష్టం చేశారు. "మీరు ఐపీఓలలో పెట్టుబడి పెట్టే స్థాయికి చేరారంటే.. మీ సంపాదనలో సగం మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇచ్చే కెపాసిటీ మీకు ఖచ్చితంగా ఉన్నట్లే. కాబట్టి ఆ డబ్బు చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా సమాజానికి ఉపయోగపడేలా ఇప్పుడే ఓ నిర్ణయానికి రండి" అని ఆమె హితవు పలికారు.
ఎవరైనా తమ కష్టార్జితాన్ని ఎందుకు దానం చేయాలనే ప్రశ్నకు మెలిండా చాలా లాజికల్‌గా సమాధానం ఇచ్చారు. అమెరికా లేదా ఏ దేశంలోనైనా అత్యంత ధనవంతులుగా మారిన వారంతా తమ విజయాల కోసం ఆయా దేశాలకు రుణపడి ఉంటారని ఆమె వాదించారు. ఒక సామాన్యుడి కోణంలో చూసినా ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీ-బిలియన్ డాలర్ కంపెనీలు విజయవంతం కావడానికి దేశంలో ఉండే రోడ్లు, విద్యుత్, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యుత్తమ విద్యా వ్యవస్థ, వైద్య సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయి. దేశం కల్పించిన వనరులను వాడుకుని ఇంత పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు.. తిరిగి ఆ సమాజానికి సేవ చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని మెలిండా గుర్తుచేశారు.
ఈ విషయంలో మెలిండా గేట్స్ కేవలం మాటలకే పరిమితం కాకుండా స్వయంగా ఆదర్శంగా నిలిచారు. సుమారు 19 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన మెలిండా.. 2010వ సంవత్సరంలో తన మాజీ భర్త బిల్ గేట్స్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌లతో కలిసి ది గివింగ్ ప్లెడ్జ్ అనే గొప్ప ముట్టడిని ప్రారంభించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ ఆస్తిలో ఎక్కువ భాగాన్ని దానం చేసేలా ప్రోత్సహించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఎయిర్‌బీఎన్‌బీ బ్రయాన్ చేస్కీ, మెకెంజీ స్కాట్, కాన్వా కో-ఫౌండర్ క్లిఫ్ ఓబ్రెచ్ట్ సహా 250 మందికి పైగా బిలియనీర్లు ఇందులో భాగస్వాములయ్యారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె పివోటల్ అనే సంస్థ ద్వారా మహిళల ఆరోగ్యం, మెనోపాజ్ సంబంధిత పరిశోధనల కోసం తాజాగా 215 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,800 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించారు.
బిలియనీర్ల ప్రవర్తనలో మీకు నచ్చని అంశం ఏది అని అడిగినప్పుడు మెలిండా చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కొందరు ధనవంతులు తమకున్న అపారమైన డబ్బును ప్రపంచానికి చూపించుకోవడానికి చేసే షోఆఫ్ తనకు అస్సలు నచ్చదని చెప్పారు. "బిలియనీర్లు తమ సంపదను ఈ విధంగా ప్రదర్శించడం సరైనది కాదని నా అభిప్రాయం. ఈ అనవసర ప్రదర్శన వల్ల సమాజానికి ఎలాంటి మేలు జరగదు. మీ అవసరాల కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పు లేదు.. కానీ దాన్ని ప్రపంచం ముందు ఒక ప్రదర్శనగా మార్చాల్సిన అవసరం లేదు" అంటూ ఆమె కొత్త కోటీశ్వరులకు హితబోధ చేశారు.