Milk Price : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరో చేదు వార్త వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పాల ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో పాల ఉత్పత్తి తగ్గి, డైరీ ఫార్మింగ్ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని డైరీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మే నెలలోనే పెరిగిన ధరలు.. జూలైలో మరో షాక్?

నిజానికి గత మే నెలలోనే అమూల్, మదర్ డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్ వంటి ప్రధాన డైరీ సంస్థలు పాల ధరలను 2 నుంచి 3 శాతం వరకు పెంచాయి. అయితే ఆ చేదు జ్ఞాపకం మరవక ముందే, రాబోయే జూలై లేదా ఆగస్టు నెల నాటికి ధరలు మరో 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ప్రధానంగా పాలు ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల్లో గనుక వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైతే ఈ ధరల పెంపు తప్పదని స్పష్టమవుతోంది.

పశుగ్రాసం కొరతతో పడిపోనున్న ఉత్పత్తి

గో చీజ్, గోవర్ధన్ బ్రాండ్ల అధినేత, పరాగ్ మిల్క్ ఫుడ్స్ చైర్మన్ దేవేంద్ర షా ఈ విషయమై మాట్లాడుతూ.. తక్కువ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీరు, పచ్చి గడ్డి దొరకడం గగనంగా మారుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ వద్ద ఉన్న పశువుల సంఖ్యను తగ్గించుకుంటారని, దీనివల్ల డైరీలకు వచ్చే పాల సరఫరా గణనీయంగా పడిపోతుందని వివరించారు. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ బ్రాండ్ ఆవిన్ ఇప్పటికే తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా మార్కెట్లో పాల సరఫరాను తగ్గించడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రభుత్వాలు, డైరీల ముందస్తు కసరత్తు

రాబోయే కరవు పరిస్థితులను తట్టుకోవడానికి మహారాష్ట్ర వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే రంగంలోకి దిగాయి. పశుసంవర్ధక శాఖ కమిషనర్ కిరణ్ పాటిల్ మాట్లాడుతూ.. ఎల్ నినో వల్ల పశుగ్రాస కొరత వచ్చే ముప్పును కొట్టిపారేయలేమని, అందుకే పాడి రైతులు ఇప్పుడే ప్రత్యామ్నాయ మేత పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. చాలా డైరీ కంపెనీలు కూడా రైతులతో కలిసి ప్రత్యేక పశుగ్రాస ప్లానింగ్‌పై పని చేస్తున్నాయి.

అమూల్, మదర్ డెయిరీ జవాబు ఇదే

ధరల పెంపు వార్తలపై అమూల్ సంస్థ బ్రాండ్ యజమాని జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జయెన్ మెహతా స్పందిస్తూ.. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదని, కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని చెప్పారు. ప్రస్తుతం వర్షాల ప్రగతిని పరిశీలిస్తున్నామని, ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు, మదర్ డైరీ ఎండీ జయతీర్థ చారి మాట్లాడుతూ.. తాము రాష్ట్రాల వారీగా పాల సేకరణ నెట్‌వర్క్‌ను నిరంతరం గమనిస్తున్నామని, ఎక్కడ కొరత ఏర్పడినా ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Tags: