New Financial Rules : పాన్ కార్డు, హెచ్ఆర్ఏ, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

Update: 2026-04-01 10:55 GMT

New Financial Rules : నేటి నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సామాన్యుల జేబుపై ప్రభావం చూపే అనేక ఆర్థిక నిబంధనలు మారిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ కొత్త మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. పాన్ కార్డు దరఖాస్తు నుంచి ఏటీఎం విత్‌డ్రాయల్స్ వరకు ప్రభుత్వం, బ్యాంకులు తీసుకొచ్చిన ఈ కీలక మార్పుల వల్ల మీ రోజువారీ ఆర్థిక లావాదేవీల తీరు మారిపోనుంది. ఆ వివరాలేంటో క్షుణ్ణంగా చూద్దాం.

పాన్ కార్డు భద్రత ఇక పక్కా

ఇప్పటివరకు ఆధార్ కార్డు ఉంటే చాలు, సులభంగా పాన్ కార్డు వచ్చేసేది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఈ పద్ధతి మారింది. పాన్ కార్డును మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం అదనపు పత్రాలను తప్పనిసరి చేసింది. ఇకపై ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ లేదా 10వ తరగతి సర్టిఫికేట్ వంటి ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును సమర్పించాలి. దీనివల్ల పాన్ కార్డు జారీకి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ నకిలీ కార్డుల బెడద తప్పుతుంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు కూడా కొత్త ఫారమ్‌లనే వాడాల్సి ఉంటుంది.

హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నారా?

ట్యాక్స్ ఆదా కోసం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసే ఉద్యోగులపై ఐటీ శాఖ నిఘా పెంచింది. ఏడాదికి రూ.లక్ష కంటే ఎక్కువ ఇంటి అద్దె చెల్లించే వారు ఇకపై తమ యజమాని పాన్ నంబర్‌ను కచ్చితంగా ఇవ్వాలి. అంతేకాకుండా, ఆ యజమాని మీ కుటుంబ సభ్యులా కాదా అనే వివరాలను కూడా ఒక ప్రత్యేక ఫారమ్‌లో నింపి ఇవ్వాల్సి ఉంటుంది. నకిలీ అద్దె రశీదులతో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందే వారికి అడ్డుకట్ట వేయడానికే ఈ కఠిన నిబంధనలను తీసుకొచ్చారు.

క్రెడిట్ కార్డ్ వాడకంపై డేగ కన్ను

మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా భారీ లావాదేవీలు చేస్తున్నారా? అయితే ఐటీ శాఖ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ డిజిటల్ ఖర్చు చేసినా లేదా రూ.లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించినా ఆ వివరాలు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు చేరుతాయి. మరోవైపు, ఒక చిన్న ఊరట ఏమిటంటే.. ఇకపై క్రెడిట్ కార్డుతో కూడా ట్యాక్స్ చెల్లించవచ్చు. అయితే దీనికి అదనపు సర్వీస్ ఛార్జీలు పడే అవకాశం ఉందని గమనించాలి.

ఏటీఎం విత్‌డ్రాయల్స్.. బ్యాంకుల కొత్త బాదుడు

హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు నగదు ఉపసంహరణ నిబంధనలను సవరించాయి. హెచ్‌డిఎఫ్‌సి మెట్రో నగరాల్లో కేవలం 3 సార్లు మాత్రమే ఉచిత ట్రాన్సాక్షన్స్ ఇస్తోంది. పీఎన్‌బీ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.50,000కు తగ్గించింది. బంధన్ బ్యాంక్ నెలవారీ ఉచిత ఆర్థిక లావాదేవీలను 5కు పరిమితం చేసింది. ఈ పరిమితి దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.

ఐటీఆర్ గడువు తేదీల్లో మార్పులు

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి కూడా కొత్త షెడ్యూల్ ఖరారైంది. ఆడిట్ అవసరం లేని ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేసేవారికి ఆగస్టు 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇక ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసేవారు జూలై 31 లోపు తమ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువు దాటితే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News