New Labour Code : కంపెనీలు ఇక తిప్పుకోవడానికి వీల్లేదు.. ఉద్యోగం వదిలేస్తే 48 గంటల్లో బకాయిలు చెల్లించాల్సిందే
48 గంటల్లో బకాయిలు చెల్లించాల్సిందే
New Labour Code : కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కొత్త లేబర్ కోడ్ ఉద్యోగులకు, వేతనజీవులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. గతంలో జీతాల చెల్లింపుల్లో ఉన్న స్పష్టత లేమిని సరిదిద్దుతూ, కొత్త నియమాలను అత్యంత పారదర్శకంగా రూపొందించారు. ఈ నూతన వేతన కోడ్ ప్రకారం.. నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులందరికీ తర్వాతి నెల 7వ తేదీ లోపే జీతం జమ చేయడం కంపెనీలకు తప్పనిసరి. అంతేకాకుండా ఒక ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేసినా లేదా కంపెనీ నుంచి తొలగించబడినా.. అతడికి రావాల్సిన పూర్తి బకాయిలను కేవలం రెండే రెండు వర్కింగ్ డేస్‌లోగా సెటిల్ చేయాల్సి ఉంటుంది.
ప్రతి ఉద్యోగికీ వర్తించేలా సమాన హక్కులు
గతంలో జీతాల చెల్లింపుల చట్టాలు కేవలం పరిమిత వేతనం పొందే తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులకు మాత్రమే వర్తించేవి. కానీ కొత్త 'కోడ్ ఆన్ వేజెస్' నిబంధనల ప్రకారం.. ఉద్యోగి జీతం ఎంతైనా సరే, చిన్న కంపెనీ అయినా, MNC అయినా ప్రతి ఉద్యోగికీ ఈ చట్టం వర్తిస్తుంది. సమయానికి జీతం పొందడం ఇకపై ప్రతి ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కుగా మారనుంది.
ఏ ఉద్యోగికి ఎప్పుడు జీతం ఇవ్వాలి?
కొత్త నిబంధనల ప్రకారం వివిధ రకాల వేతన సమయ పరిమితులు ఈ క్రింది విధంగా ఉంటాయి:
* నెలవారీ ఉద్యోగులు: తర్వాతి నెల 7వ తేదీ లోగా జీతం వేయాలి.
* వారపు వేతనాలు పొందేవారు: వారం చివరి పనిదినం నాటికి డబ్బులు చెల్లించాలి.
* 15 రోజులు ప్రాతిపదికన పనిచేసేవారు: 15 రోజుల వ్యవధి ముగిసిన 2 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలి.
* రోజువారీ కూలీలు: పని పూర్తయిన రోజే ఆ సాయంత్రం వేతనం అందించాలి.
జాబ్ వదిలేస్తే.. 2 రోజుల్లోనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్
ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించినా లేదా ఇతర కారణాలతో సేవలు ముగిసినా.. కంపెనీలు నెలల తరబడి ఎఫ్ & ఎఫ్ (ఫుల్ & ఫైనల్ సెటిల్మెంట్) కోసం తిప్పుకోవడానికి వీల్లేదు. ఉద్యోగ సంబంధం ముగిసిన కేవలం 2 వర్కింగ్ డేస్‌లోనే రావాల్సిన బాకీలు, పెండింగ్ జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సహా అన్ని రకాల సెటిల్‌మెంట్లను పూర్తి చేయాల్సిందే.
జీతం ఆలస్యమైతే కంపెనీలపై కఠిన చర్యలు
కంపెనీలు సమయానికి జీతాలు చెల్లించకపోయినా, అనుమతి లేకుండా వేతనంలో కోతలు విధించినా ఉద్యోగులు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్‌స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్లను నియమిస్తుంది. ఉద్యోగికి మూడేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. విచారణ తర్వాత అధికారి ఆదేశించినప్పటికీ కంపెనీ డబ్బులు చెల్లించకపోతే, ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసే కఠిన నిబంధనలను ఉపయోగించి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అలాగే ప్రతి ఉద్యోగికీ డిజిటల్ లేదా కాగితం రూపంలో పే-స్లిప్ ఇవ్వడం తప్పనిసరి.