LPG Supply : గ్యాస్ టెన్షన్ లేదు.. సామాన్యులకు కేంద్రం భరోసా.. యుద్ధం ముసిరినా ఆగని వంటగ్యాస్ సరఫరా
యుద్ధం ముసిరినా ఆగని వంటగ్యాస్ సరఫరా
LPG Supply :పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినా భారతీయ వినియోగదారులకు గ్యాస్ కష్టాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇంధన భద్రత విషయంలో భారత్ తీసుకున్న ముందస్తు చర్యల వల్ల వంట గ్యాస్, పైప్డ్ గ్యాస్ సరఫరాలో ఎటువంటి కోత ఉండదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ, భారత్ మాత్రం దేశీయ వినియోగదారులకు అగ్రతాంబూలం ఇస్తోంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశీయ అవసరాల కోసం ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ సరఫరాను 100 శాతం భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం దేశీయ రిఫైనరీలలో గ్యాస్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పట్టణాల్లో బుకింగ్ గ్యాప్‌ను 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా సర్దుబాటు చేస్తూ డిమాండ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు.
గృహ వినియోగదారుల తర్వాత ప్రాధాన్యత క్రమంలో పరిశ్రమలకు కూడా గ్యాస్ అందిస్తున్నారు. కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాను ఇప్పటికే 70 శాతానికి పునరుద్ధరించారు. మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,34,000 టన్నుల కమర్షియల్ గ్యాస్ విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా హాస్పిటల్స్, స్కూళ్లు, ఫార్మాస్యూటికల్స్, అగ్రికల్చర్ రంగాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ కేటాయింపులు చేస్తున్నారు. ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువులో 95 శాతం అవసరాలను ప్రభుత్వం తీరుస్తోంది.
గ్యాస్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు డిజిటల్ పద్ధతులను పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 98 శాతం బుకింగ్స్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అలాగే 93 శాతం డెలివరీలు అథెంటికేషన్ కోడ్ ద్వారానే పూర్తవుతున్నాయి. ఇక వలస కార్మికులు, పేదలకు ఊరటనిచ్చేలా 5 కిలోల సిలిండర్ల లభ్యతను ప్రభుత్వం రెట్టింపు చేసింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 14.6 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయంటే వీటి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి.
కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మే డీలర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే నిఘా కమిటీలు 2,100 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 237 మంది డీలర్లకు భారీ జరిమానాలు విధించాయి. మరో 58 మంది లైసెన్సులను సస్పెండ్ చేశాయి. దేశంలో నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరానికి అనుగుణంగానే గ్యాస్, పెట్రోల్ వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.