UPI : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్: సెప్టెంబర్ 4 నుంచి మొబైల్ నంబర్లు కనిపించవు

మొబైల్ నంబర్లు కనిపించవు

Update: 2026-07-30 05:36 GMT

 UPI : దేశంలో డిజిటల్ పేమెంట్ల విప్లవం సృష్టించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్‌లో ఎన్‌పీసీఐ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం తెచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం పరిధిలోకి యూపీఐ వ్యవస్థను తీసుకొచ్చేందుకు బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు మొబైల్ నంబర్లు లేదా పూర్తి పేర్లు మూడో వ్యక్తికి స్పష్టంగా కనిపించడం వల్ల ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా రిస్క్ ఎదురయ్యే అవకాశం ఉందని భావించి ఈ కొత్త కసరత్తు చేపట్టింది.

మొబైల్ నంబర్లకు మాస్కింగ్

ఇప్పటివరకు యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అవతలి వ్యక్తికి పూర్తి మొబైల్ నంబర్ కనిపించేది. ముఖ్యంగా మహిళా వినియోగదారుల నుంచి ప్రైవసీ భద్రతపై సోషల్ మీడియాలో అనేక ఫిర్యాదులు రావడంతో ఎన్‌పీసీఐ కఠిన చర్యలకు దిగింది. ఇకపై యూపీఐ యాప్‌లు, బ్యాంకింగ్ ఇంటర్‌ఫేస్‌లలో ఫోన్ నంబర్లు, ఖాతా వివరాలను మాస్క్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీని అమలుకు సెప్టెంబర్ 4వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది.

చివరి 4 అంకెలు మాత్రమే డిస్‌ప్లే

కొత్త నిబంధనల ప్రకారం.. చెల్లింపులు జరిపే సమయంలో అవతలి యూజర్‌కి కేవలం మొబైల్ నంబర్‌లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేసిన తర్వాత యాప్‌లో మొబైల్ నంబర్ అసలు కనిపించకూడదు. అదేవిధంగా యూపీఐ ఐడీ, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇతరులకు కాకుండా మాస్కింగ్ ప్రాసెస్ ద్వారా దాచబడతాయి. దీనివల్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చని ఎన్‌పీసీఐ భావిస్తోంది.

యూజర్ నేమ్ ఆధారిత యూపీఐ ఐడీలే డిఫాల్ట్

సాధారణంగా యూజర్లు మొదటగా యూపీఐ సైన్-అప్ అయినప్పుడు తమ ఫోన్ నంబర్‌నే వర్చువల్ ప్రైవేట్ అడ్రస్ లేదా యూపీఐ ఐడీగా ఎంచుకుంటారు. అయితే యూజర్ నేమ్ ఆధారంగా ప్రత్యమ్నాయ ఐడీలు క్రియేట్ చేసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ చాలామందికి దానిపై అవగాహన ఉండటం లేదు. ఇకపై మొబైల్ నంబర్ ఆధారిత ఐడీలకు బదులుగా, యూజర్ నేమ్ ఆధారిత ఐడీలనే డిఫాల్ట్ ఆప్షన్‌గా అందించాలని యాప్‌లకు ఎన్‌పీసీఐ సూచించింది. దీనివల్ల మీ ఫోన్ నంబర్ వేరొకరికి తెలిసే అవకాశమే ఉండదు.

Tags:    

Similar News