Oyo IPO : ఐపీఓ మార్కెట్‌లో ఓయో సంచలనం..రూ.6,650 కోట్ల మెగా ప్లాన్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్
రూ.6,650 కోట్ల మెగా ప్లాన్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్
Oyo IPO : ప్రముఖ హోటల్, ట్రావెల్ టెక్నాలజీ దిగ్గజం ఓయో త్వరలోనే షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టి రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఓయో మాతృ సంస్థ అయిన PRISM ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకు భారతీయ ప్రతిభూతులు, వినమయ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కంపెనీ తన లిస్టింగ్ ప్రణాళికల్లో భాగంగా డిసెంబర్ 2025 చివరి వారంలోనే సెబీ వద్ద రహస్యంగా డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా, దానికి ఇప్పుడు క్లియరెన్స్ లభించింది. దీనితో ఐపీఓ ద్వారా భారీగా నిధులు సేకరించడానికి ఓయోకు మార్గం సుగమమైంది.
రూ.6,650 కోట్ల నిధుల సేకరణ.. రూ.70 వేల కోట్ల వాల్యుయేషన్
గత ఏడాది డిసెంబర్ 20న జరిగిన కంపెనీ అసాధారణ సాధారణ సమావేశంలో కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.6,650 కోట్ల వరకు నిధులను సేకరించడానికి వాటాదారులు ఇప్పటికే ఆమోదం ముద్ర వేశారు. ఈ మెగా ఐపీఓ ద్వారా ఓయో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 7 నుంచి 8 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.60,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్లు) మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జూలైలో పబ్లిక్ డ్రాఫ్ట్ దాఖలు
ఐపీఓ ప్రక్రియలో తదుపరి దశగా కంపెనీ తన అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP-1)ను బహిరంగంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పత్రం పబ్లిక్ రివ్యూ, ప్రజల అభిప్రాయాల కోసం 21 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. జూలై 2026 మొదటి వారంలోనే ప్రిజమ్ సంస్థ ఈ యూడీఆర్‌హెచ్‌పి-1ను దాఖలు చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు మరియు లిస్టింగ్‌కు సరైన సమయం కోసం కంపెనీ వేచి చూస్తోంది.
రంగంలోకి దిగ్గజ బ్యాంకులు.. బోర్డులోకి మాజీ సెబీ చైర్మన్
ఈ భారీ ఐపీఓను విజయవంతం చేయడం కోసం ప్రిజమ్ సంస్థ దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నియమించుకుంది. ఇందులో యాక్సిస్ క్యాపిటల్స్, సిటీబ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎమ్ ఫైనాన్షియల్, ఇన్‌క్రిడ్ క్యాపిటల్ మరియు ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. వీటికి తోడు, ఇటీవలే సెబీ మాజీ చైర్మన్ అజయ్ త్యాగిని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా చేర్చుకోవడం విశేషం.
మూడీస్ బంపర్ రేటింగ్.. లాభాలు డబుల్
ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రిజమ్ కంపెనీకి B2 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను స్థిరమైన దృక్పథంతో కొనసాగించింది. ఆర్థిక సంవత్సరం 2026 లో కంపెనీ ఎబిట్టా లాభాలు మునుపటి కంటే రెండింతలు పెరిగి దాదాపు 280 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.2,496 కోట్లు) చేరుకోవచ్చని మూడీస్ అంచనా వేసింది. గ్లోబల్ మార్కెట్లో జీ6 హాస్పిటాలిటీని కొనుగోలు చేయడం, ప్రీమియం హోటళ్ల విస్తరణ, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం ఓయో లాభాల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.