Pakistan : పాక్‌కు ఏ దేశం నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయో తెలుసా? టాప్‌లో నిలిచిన సౌదీ, యూఏఈ

టాప్‌లో నిలిచిన సౌదీ, యూఏఈ

Update: 2026-07-10 10:45 GMT

Pakistan : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు విదేశాల్లో నివసిస్తున్న ఆ దేశ పౌరులు పంపుతున్న డబ్బు ఒక పెద్ద సంజీవనిలా మారింది. IMF రంగంలోకి దిగి పాక్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠినమైన సంస్కరణలను సిఫార్సు చేసి, వాటిని అమలు చేయించినప్పటి నుంచి పాకిస్థాన్ వృద్ధి రేటు గణాంకాల పరంగా కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్‌కు సొంతంగా చేసుకునే వ్యాపారాల కంటే విదేశాల్లో ఉండే పౌరుల నుండే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఇది ఎంతలా ఉందంటే, ప్రస్తుతం పాకిస్థాన్ దేశం మొత్తం మీద చేసే ఎగుమతుల విలువ కంటే.. విదేశాల నుంచి ఆ దేశానికి అందిన రెమిటెన్స్ మొత్తమే చాలా ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆర్థిక సంవత్సరం 2026లో పాకిస్థాన్ సరికొత్త రికార్డు

పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. జూన్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం 2026లో ఆ దేశానికి రికార్డు స్థాయిలో విదేశీ నిధులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న పాక్ కార్మికులు, ఉద్యోగులు తమ దేశానికి ఏకంగా 41.6 బిలియన్ అమెరికన్ డాలర్ల రికార్డు స్థాయి రెమిటెన్స్‌ను పంపించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లో అందిన 38.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈసారి వచ్చిన సొమ్ము 8.6 శాతం అదనంగా పెరిగింది. పాకిస్థాన్ చరిత్రలోనే ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో రెమిటెన్స్ రావడం ఇదే మొదటిసారి అని ఆ దేశ ఆర్థిక మంత్రి సలహాదారు ఖుర్రమ్ షెహజాద్ స్పష్టం చేశారు. విదేశీ ప్రవాసులకు దేశంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

పాక్‌కు ఏ దేశం నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ శ్రమిస్తున్న పాకిస్థానీయుల వల్లే గత మూడేళ్లుగా ఈ అసాధారణ వృద్ధి సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి పాకిస్థాన్‌కు భారీగా నిధులు అందుతున్నాయి. అందుతున్న డేటా ప్రకారం కేవలం జూన్ నెలలోనే సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా 829.6 మిలియన్ అమెరికన్ డాలర్లు పాకిస్థాన్‌కు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో యూఏఈ నుంచి 792.3 మిలియన్ డాలర్లు అందాయి. వీటితో పాటు యూకే నుంచి 514.9 మిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 296.8 మిలియన్ డాలర్లు వచ్చాయి. వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు పంపిన ఇతర దేశాలలో ఇటలీ (121.1 మిలియన్ డాలర్లు), ఒమన్ (110.8 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. అయితే రెమిటెన్స్‌లో 8.6 శాతం వృద్ధి నమోదైనప్పటికీ, ఆర్థిక సంవత్సరం 2025 లో నమోదైన 26.6 శాతం గ్రోత్ రేట్ కంటే ఇది కాస్త తక్కువ కావడం గమనార్హం.

భారీ వ్యాపార లోటును భర్తీ చేసిన ప్రవాస పాకిస్థానీయులు

ఈ విదేశీ సొమ్ము పాకిస్థాన్‌కు ఎంత పెద్ద ఊరటనిచ్చిందంటే.. ఆ దేశం సాధించిన నికర ఎగుమతుల ఆదాయం కేవలం 30.1 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే. కానీ విదేశాల నుంచి వచ్చిన రెమిటెన్స్ మాత్రం 41.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఎగుమతుల కంటే దాదాపు 11 బిలియన్ డాలర్లు అదనంగా ప్రవాసుల ద్వారానే దేశానికి లభించాయి. ఇదే సమయంలో పాకిస్థాన్ దాదాపు 40 బిలియన్ డాలర్ల భారీ ట్రేడ్ డెఫిసిట్ ను ఎదుర్కొంది. అంటే దేశంలోకి వచ్చే ఆదాయం కంటే దేశం నుండి బయటకు వెళ్లే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ఈ భయంకరమైన వ్యాపార లోటును విదేశాల్లోని వర్కర్లు పంపిన రెమిటెన్స్ సొమ్ముతోనే పాక్ ప్రభుత్వం భర్తీ చేయగలిగింది. ఈ కారణంగానే గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి మరియు దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి రెమిటెన్స్ అనేది పాకిస్థాన్‌కు అత్యంత కీలకమైన లైఫ్‌లైన్‌గా మారింది.

Tags:    

Similar News