Pakistan Economic Crisis : పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం.. పాత అప్పుల కోసం కొత్త భిక్షాటన.. మళ్ళీ చైనా, సౌదీల వైపు చూపు
పాత అప్పుల కోసం కొత్త భిక్షాటన.. మళ్ళీ చైనా, సౌదీల వైపు చూపు
Pakistan Economic Crisis : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పాతాళానికి పడిపోయింది. ఆ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా అప్పులు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెల్లించాల్సిన బాకీల కోసం పాకిస్థాన్ ఇప్పుడు సౌదీ అరేబియా, చైనా దేశాల ముందు చేతులు చాస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అప్పే.. ముప్పై అన్నట్లుగా తయారైంది.
యూఏఈ బాకీ తీర్చాల్సిందే
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ ప్రస్తుతం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్ల (సుమారు 30 వేల కోట్ల రూపాయలు) నిధులను సేకరించే ప్రయత్నాల్లో ఉంది. ఈ సొమ్మును ప్రధానంగా యూఏఈకి చెల్లించాల్సి ఉంది. గతంలో పాకిస్థాన్ తన రుణాలను రోలోవర్ (చెల్లింపు గడువును పొడిగించడం) చేసుకునేది. కానీ ఈసారి యూఏఈతో అటువంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఈ నెలాఖరుకల్లా ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన ఒత్తిడి పాకిస్థాన్‌పై పెరిగింది. ఇది చెల్లిస్తే ఆ దేశ విదేశీ మారక నిల్వలు పూర్తిగా అట్టడుగుకు చేరుతాయి.
సౌదీ అరేబియాతో చర్చలు
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ ఇప్పుడు సౌదీ అరేబియాను శరణు కోరుతోంది. ఇటీవల సౌదీ ఆర్థిక మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. కేవలం ఆర్థికంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా సౌదీ అరేబియా అండ దొరికితే కొంత కాలం నెట్టుకురావచ్చని పాక్ ప్రధాని భావిస్తున్నారు. అయితే, సౌదీ నుంచి ఎంత మేరకు సహాయం అందుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
చైనా అప్పుల భారం
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలో చైనా పాత్ర చాలా పెద్దది. పాకిస్థాన్‌కు అత్యధికంగా అప్పులిచ్చిన దేశం చైనాయే. ఇప్పటికే చైనాకు పాకిస్థాన్ 25 బిలియన్ డాలర్లకు పైగా బాకీ ఉంది. సీపీఈసీ వంటి భారీ ప్రాజెక్టుల పేరుతో చైనా ఇస్తున్న అప్పులు పాకిస్థాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ నుంచి మరిన్ని రుణాలు పొందేందుకు పాక్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఐఎంఎఫ్ షరతులు:
అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 7 బిలియన్ డాలర్ల సహాయం పొందేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంది. అందులో కొంత భాగం అందినప్పటికీ, అది మొత్తం సమస్యను పరిష్కరించలేకపోతోంది. ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతుల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజలపై పెను భారం పడుతోంది. పాత అప్పులు తీర్చడమే గగనమైపోతున్న తరుణంలో, మిత్ర దేశాలైన చైనా, సౌదీలు ఆదుకోకపోతే పాకిస్థాన్ పూర్తిగా దివాళా తీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.