PM Modi : ఇక పెట్రోల్ కష్టాలకు చెక్.. యూఏఈతో 3 కోట్ల బ్యారెళ్ల ముడిచమురు నిల్వకు ఒప్పందం
యూఏఈతో 3 కోట్ల బ్యారెళ్ల ముడిచమురు నిల్వకు ఒప్పందం
PM Modi : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత ఇంధన భద్రతకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన దేశానికి కొండంత అండను ఇచ్చింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా యూఏఈ ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. భారత్‌లోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో ఏకంగా 30 మిలియన్ బ్యారెళ్ల (3 కోట్ల బ్యారెళ్లు) ముడిచమురును నిల్వ చేసేందుకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
అబుదాబిలో ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన చర్చలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. కేవలం చమురు మాత్రమే కాకుండా, భారత్‌లోని బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఆర్థిక రంగాలలో దాదాపు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.42,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది. యుద్ధ సమయంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.
భవిష్యత్తులో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు భారత్‌లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ (LPG) సరఫరా ఒప్పందం కుదిరింది. దీనివల్ల సామాన్యులకు వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రక్షణ రంగం, నౌకల నిర్మాణం, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా సరికొత్త ఒప్పందాలు చేసుకుని ద్వైపాక్షిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లారు.
హోర్ముజ్ జలసంధిని మూసివేసినా చమురు సరఫరా ఆగకుండా ఉండేందుకు యూఏఈ ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్ వేసింది. వెస్ట్-ఈస్ట్ పైప్‌లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసి, 2027 నాటికి ఫుజైరా ఓడరేవు ద్వారా ఎగుమతి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల యుద్ధం వచ్చినా చమురు ట్యాంకర్లు సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. యూఏఈ పై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, కష్టకాలంలో ఆ దేశానికి అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనతో భారత్-యూఏఈల మధ్య బంధం మరింత పవర్ ఫుల్గా మారింది.