PM Surya Ghar Yojana : ఒక్క తప్పుతో రూ.78,000 సబ్సిడీ గోవిందా.. సోలార్ ప్యానెల్స్ పెట్టించే ముందు ఇది తెలుసుకోండి

సోలార్ ప్యానెల్స్ పెట్టించే ముందు ఇది తెలుసుకోండి

Update: 2026-05-29 11:33 GMT

PM Surya Ghar Yojana : ప్రస్తుత రోజుల్లో నడి వేసవిలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ కరెంట్ బిల్లులు చూస్తే సామాన్యుల గుండె గుభేల్ అంటోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై జనాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టేసి జీవితాంతం ఉచితంగా కరెంట్ వాడుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. కానీ, ఈ పథకం కింద అప్లై చేసే ముందే ఒక పెద్ద సాంకేతిక మెలిక దాగి ఉంది. మార్కెట్లో దొరికే రెండు రకాల సోలార్ సిస్టమ్స్‌లో ఏది పడితే అది ఎంచుకుంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.78,000 భారీ సబ్సిడీ డబ్బులు రాకుండానే మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆ అస్సలు సీక్రెట్ ఏంటో, ఏది పెడితే లాభమో వివరంగా తెలుసుకుందాం.

ప్రభుత్వ సబ్సిడీ కేవలం దీనికేనా?

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే మనకు అత్యంత లాభదాయకమైనది ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ సాంకేతికత నేరుగా మీ ఏరియాలోని ప్రభుత్వ కరెంట్ గ్రిడ్‌తో కనెక్ట్ అయి పనిచేస్తుంది. దీనిలో ఎలాంటి ఖరీదైన బ్యాటరీలను వాడాల్సిన అవసరం లేదు. పగటిపూట ఎండ తగిలినప్పుడు ఈ ప్యానెల్స్ ద్వారా తయారయ్యే కరెంట్‌తో మీ ఇంట్లోని ఏసీ, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తాయి. ఒకవేళ మీ ఇంటి అవసరాల కంటే ఎక్కువ కరెంట్ తయారైతే.. అది నెట్ మీటరింగ్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ప్రభుత్వ గ్రిడ్‌కు వెళ్ళిపోతుంది. రాత్రి పూట ప్యానెల్స్ పనిచేయవు కాబట్టి, అప్పుడు మీరు ప్రభుత్వం నుంచి కరెంట్ వాడుకోవచ్చు. నెలాఖరున మీరు ప్రభుత్వానికి ఇచ్చిన కరెంట్, వాడుకున్న కరెంట్ లెక్కలు చూసి బిల్లు సున్నా లేదా మైనస్‌లోకి వస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.78,000 సబ్సిడీ కేవలం ఈ ఆన్-గ్రిడ్ సిస్టమ్‌కు మాత్రమే వర్తిస్తుంది.

ఎందుకో తెలుసా?

ఇక రెండో రకం ఆఫ్-గ్రిడ్ సోలార్ సిస్టమ్. దీనికి ప్రభుత్వ కరెంట్ నెట్‌వర్క్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పూర్తిగా మీ ఇంట్లోనే అమర్చుకునే భారీ బ్యాటరీల పై ఆధారపడి నడుస్తుంది. పగటిపూట సోలార్ ద్వారా వచ్చే పవర్‌తో ఇల్లు గడవడంతో పాటు ఆ బ్యాటరీలు చార్జ్ అవుతాయి. రాత్రి పూట ఆ బ్యాటరీల బ్యాకప్ ద్వారా ఇల్లు వెలుగుతుంది. ఈ సిస్టమ్‌లో బ్యాటరీల ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం వల్ల, దీని ప్రారంభ పెట్టుబడి ఆన్-గ్రిడ్ కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒకసారి లక్షలు పెట్టి బ్యాటరీలు మార్చాల్సి వస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫ్-గ్రిడ్ సిస్టమ్‌కు ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు. 12 నుంచి 15 గంటల పాటు కరెంట్ కోతలు ఉండే మారుమూల అడవులు లేదా కొండ ప్రాంతాలకే ఇది సెట్ అవుతుంది.

సబ్సిడీ కావాలి అనుకుంటే హైబ్రిడ్ రూట్

మీ ఏరియాలో అప్పుడప్పుడు కరెంట్ పోతుంటుంది, అలాగని ప్రభుత్వ సబ్సిడీ వదులుకోవడం ఇష్టం లేదు అనుకునే వారికి హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ఒక అద్భుతమైన వరం. ఇది ఆన్-గ్రిడ్, ఆఫ్-గ్రిడ్ ల కలయికతో పనిచేస్తుంది. ఇది ప్రభుత్వ గ్రిడ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, దీనిపై మీకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మొత్తం పక్కాగా దక్కుతుంది. అదే సమయంలో అత్యవసర కరెంట్ కోతల కోసం ఇందులో ఒక చిన్న బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అమర్చుకోవచ్చు. అయితే, సాధారణ ఆన్-గ్రిడ్ సిస్టమ్‌తో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

మీరు గనుక కరెంట్ కోతలు పెద్దగా లేని నగరాలు, పట్టణాల్లో నివసిస్తుంటే.. అస్సలు ఆలోచించకుండా ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ అమర్చుకోవడమే అత్యంత తెలివైన పని. దీనివల్ల మీకు మూడు ప్రత్యక్ష లాభాలు ఉన్నాయి. మొదటిది.. ఇది చాలా తక్కువ ధరకే వస్తుంది. దీనిపై ప్రభుత్వ సబ్సిడీ దక్కుతుంది. రెండోది.. నెట్ మీటరింగ్ వల్ల కరెంట్ బిల్లుల టెన్షన్ శాశ్వతంగా పోతుంది. మూడోది.. ఇందులో ఎలాంటి బ్యాటరీలు ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు అస్సలు ఉండదు. ఈ ప్యానెల్స్ ఒకసారి పెడితే ఏకంగా 25 ఏళ్ల పాటు ఎలాంటి రిపేర్లు లేకుండా నిరంతరాయంగా ఉచిత కరెంట్‌ను అందిస్తూనే ఉంటాయి.

Tags:    

Similar News