High Court: హైకోర్టు సంచలన తీర్పు..ఉద్యోగం వచ్చాక రెండో పెళ్లి చేసుకున్న కోడలు జీతంలోంచి రూ.20వేలు కట్
ఉద్యోగం వచ్చాక రెండో పెళ్లి చేసుకున్న కోడలు జీతంలోంచి రూ.20వేలు కట్
High Court: భర్త మరణానంతరం కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఒక మహిళ, ఆ ఉద్యోగం వచ్చిన కేవలం 18 రోజులకే అత్తమామలను విడిచిపెట్టి, రెండో పెళ్లి చేసుకోవడం రాజస్థాన్‌లో వివాదానికి దారితీసింది. మరణించిన కొడుకుపై ఆర్థికంగా ఆధారపడిన అత్తమామలకు న్యాయం చేయాలని కోరుతూ మహిళ మామగారు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం ఇచ్చిన ఉద్యోగాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, ఆ మహిళ జీతం నుంచి ప్రతి నెలా రూ.20,000 కోత విధించి మామగారి ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది.
ఈ కేసు రాజస్థాన్‌కు సంబంధించినది. అజ్మీర్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ 2015 సెప్టెంబర్ 15న ఉద్యోగంలో ఉండగా మరణించారు. రాజేష్ మరణానంతరం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం డిపార్ట్‌మెంట్ కారుణ్య నియామకానికి దరఖాస్తు కోరింది. రాజేష్ తండ్రి భగవాన్కు ఈ అవకాశం లభించినప్పటికీ, తన కోడలుకు ఉద్యోగం వస్తే కుటుంబానికి అండగా ఉంటుందని భావించి, ఆమెకు అనుకూలంగా ఆ అవకాశాన్ని వదులుకున్నారు.
మహిళకు ఉద్యోగం లభించింది, అలాగే ఆమెకు 70% ప్రావిడెంట్ ఫండ్, ఇతర పరిహారం కూడా అందింది. అయితే, ఉద్యోగం వచ్చిన కేవలం 18 రోజుల్లోనే ఆమె అత్తమామలను విడిచిపెట్టి, వేరే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కోడలు తన బాధ్యతలను విస్మరించడంతో, మృతుడి తండ్రి భగవాన్ న్యాయం కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను మొదట్లో అత్తమామలకు సహాయం చేసినా, వారు తనను వేధించారని, అందుకే ఇల్లు వదిలి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మహిళ కోర్టులో వాదించింది.
రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం, మరణించిన కుమారుడి సంపాదనపైనే అత్తమామలు ఆర్థికంగా పూర్తిగా ఆధారపడ్డారని, వారి కుమారుడి అకాల మరణంతో వారు నిస్సహాయులయ్యారని గుర్తించింది. కారుణ్య నియామకం ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం అని హైకోర్టు స్పష్టం చేసింది. అత్తమామల ఆర్థిక అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు మహిళకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించింది.
రాజస్థాన్ హైకోర్టు, మహిళ జీతం నుంచి నెలకు రూ.20,000 మొత్తాన్ని తప్పనిసరిగా కోత విధించి, ఆ మొత్తాన్ని ఆమె మామగారి (భగవాన్) ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అజ్మీర్ విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం పొందిన తర్వాత తన దివంగత భర్త తల్లిదండ్రులను పూర్తిగా విస్మరించడం సరైనది కాదని, చట్టం కుటుంబ బాధ్యతను విస్మరించడానికి అనుమతించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కారుణ్య నియామకాల వెనుక ఉన్న నైతిక బాధ్యతను బలంగా నొక్కి చెబుతుంది.