Fake Currency : ఫేక్ నోట్ల ఆటకట్టించేందుకు ఆర్బీఐ సంచలన నిర్ణయం
ఆర్బీఐ సంచలన నిర్ణయం
Fake Currency : మార్కెట్‌లో నకిలీ నోట్ల చెలామణిని అరికట్టేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఫేక్ కరెన్సీ రాకుండా నిరోధించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని బ్యాంకులు నకిలీ నోట్లను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని గమనించిన ఆర్బీఐ, అన్ని బ్యాంకులను అప్రమత్తం చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్న జిల్లాల్లోని అన్ని బ్యాంక్ బ్రాంచులలో అధునాతన నోట్ల తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. సామాన్య ప్రజల కష్టార్జితం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
సరిహద్దు జిల్లాల బ్యాంకుల్లో ప్రత్యేక తనిఖీ యంత్రాలు
సాధారణంగా పొరుగు దేశాల నుంచి సరిహద్దుల గుండా నకిలీ నోట్లను దేశంలోకి పంపించే ముఠాలు ఎక్కువగా క్రియాశీలకంగా ఉంటాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు సరిహద్దు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న జిల్లాల్లోని ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌లో నోట్ల వర్గీకరణ, ప్రామాణికతను తనిఖీ చేసే ఆథెంటికేషన్ మెషిన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనికి తోడు ప్రతి బ్యాంక్ బ్రాంచ్, బ్యాక్ ఆఫీసుల్లో ఆల్ట్రా-వయొలెట్ ల్యాంప్‌లను తప్పనిసరిగా ఉంచాలని స్పష్టం చేసింది. వీటి ద్వారా నకిలీ నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.
నకిలీ నోటు పట్టుబడితే జప్తు
బ్యాంకులకు వచ్చే ప్రతి నోటును కచ్చితంగా మెషిన్ ద్వారా తనిఖీ చేయాలని ఆర్బీఐ తెలిపింది. ఒకవేళ కౌంటర్‌లో డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడికి తెచ్చిన నోట్లలో నకిలీది అని తేలితే, బ్యాంక్ సిబ్బంది ఆ నోటును తక్షణమే సీజ్ చేస్తారు. ఆ నకిలీ నోటును సదరు కస్టమర్‌కు తిరిగి ఇవ్వడం గానీ, లేదా దానిని చింపేయడం గానీ చేయకూడదు. సదరు నోటు వివరాలను రికార్డుల్లో నమోదు చేసి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రజలు కూడా కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అక్టోబర్ 31, 2026 లోపు సిబ్బందికి ముమ్మర శిక్షణ
యంత్రాలు ఉన్నప్పటికీ, క్యాష్ కౌంటర్లలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకమని ఆర్బీఐ పేర్కొంది. అందుకే క్యాష్ హ్యాండ్లింగ్ చేసే ప్రతి బ్యాంక్ ఉద్యోగికి అసలు నోట్లలో ఉండే సెక్యూరిటీ ఫీచర్లను గుర్తించడంలో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. దీనికోసం ప్రత్యేక అవగాహన, రిఫ్రెషర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 31, 2026 నాటికి నగదు లావాదేవీలు నిర్వహించే సిబ్బంది అందరికీ ఈ శిక్షణ పూర్తి కావాలని ఆర్బీఐ గడువు విధించింది.
డేటా విశ్లేషణతో నకిలీ నోట్ల స్థావరాల వేట
నకిలీ నోట్ల నెట్‌వర్క్‌ను మూలాల నుంచి ఉపకరించి అంతం చేసేందుకు సాంకేతికత, డేటాను ఆర్బీఐ ఉపయోగిస్తోంది. బ్యాంకుల్లోని ఫోర్జ్డ్ నోట్ విజిలెన్స్ సెల్‌ను మరింత క్రియాశీలకంగా మార్చాలని సూచించింది. పట్టుబడిన నకిలీ నోట్ల డేటాను విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతాల నుంచి లేదా ఏ జిల్లాల నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయో కచ్చితంగా గుర్తించవచ్చని, ఆ సమాచారం ఆధారంగా నిఘాను మరింత తీవ్రతరం చేయవచ్చని ఆర్బీఐ వివరించింది.