RBI : క్రిప్టో ఆస్తులపై పూర్తి నిషేధమే కరెక్ట్.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను దూరంగా ఉంచాలన్న ఆర్బీఐ
ఆర్బీఐ
RBI : భారత కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టోకరెన్సీలు, ప్రైవేట్ స్టేబుల్‌కాయిన్స్‌పై తన పాత కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఫైనాన్స్) సమక్షంలో ఆర్‌బీఐ ఉన్నతాధికారులు హాజరై, దేశ ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో ఆస్తులు ఒక పెద్ద ముప్పని తేల్చి చెప్పారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని ఈ కమిటీ ఎదుట ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తమ బలమైన వాదనలను వినిపించారు. దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ క్రిప్టో లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండేలా చట్టాలు చేయాలని వారు పార్లమెంటరీ ప్యానెల్‌కు గట్టిగా సిఫార్సు చేశారు.
కమిటీకి సమర్పించిన నివేదికలో ఆర్‌బీఐ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం క్రిప్టోలపై పూర్తి నిషేధం విధించడం అనేది ఒక సరైన విధానమని, దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలని కోరింది. ఒకవేళ క్రిప్టోకరెన్సీలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తే, ఎలాంటి ఆర్థిక విలువ లేని వ్యాపారానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల సాధారణ ప్రజల్లో ఇవి సురక్షితమైనవనే తప్పుడు నమ్మకం ఏర్పడుతుందని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రపంచంలో క్రిప్టోకరెన్సీలను ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇస్తున్న రేటింగ్‌లను ఆర్‌బీఐ పూర్తిగా తోసిపుచ్చింది. ఈ సర్వేల పద్ధతి తప్పుగా ఉందని, కేవలం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల గణాంకాలను ఇవి భూతద్దంలో చూపిస్తున్నాయని మండిపడింది. ఆర్‌బీఐ అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 54 ఎఫ్‌ఐయూ నమోదిత క్రిప్టో సేవా సంస్థలు ఉన్నాయి. వీటిలో 3.93 కోట్ల మంది కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులు ఉండగా, వారి వద్ద సుమారు రూ.20,436.59 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తులు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రైవేట్ స్టేబుల్‌కాయిన్స్ వాడకం పెరిగితే దేశ ద్రవ్య సార్వభౌమత్వానికి, ఆర్థిక విధానాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఏ ప్రైవేట్ కరెన్సీ కూడా డబ్బుకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలను కలిగి లేవని నివేదికలు చెబుతున్నాయి. వీటికి బదులుగా ప్రభుత్వం అధికారికంగా తెచ్చిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)ని ప్రోత్సహించాలని సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న క్రిప్టో లావాదేవీలలో ఎక్కువ భాగం మోసాలు, స్కామ్‌లు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించినవేనని, అమాయక ఇన్వెస్టర్లను వీటి నుంచి కాపాడటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్‌బీఐ విధాన నిర్ణేతలకు స్పష్టం చేసింది.