RBI Gold Reserves : ఆర్‌బీఐ ఒక్క గ్రాము బంగారం కూడా అమ్మలేదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

Update: 2026-07-21 04:53 GMT

RBI Gold Reserves : భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న గోల్డ్ నిల్వల నుంచి ఒక్క గ్రాము బంగారాన్ని కూడా విక్రయించలేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, విదేశీ మారక నిల్వల (ఫారెక్స్ రిజర్వ్స్) రక్షణ సాకుతో ఆర్‌బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1 లక్ష కోట్లు) విలువైన బంగారాన్ని అమ్మివేసిందంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, తప్పుదోవ పట్టించే ప్రచారాలని తేల్చిచెప్పింది.

ఆర్‌బీఐ వద్ద సురక్షితంగా 880.52 టన్నుల పసిడి

మే 29, 2026 నాటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వల రూపంలో ఉన్న బంగారం పరిమాణం 880.52 టన్నులుగా నిలకడగా ఉందని కేంద్రం తెలిపింది. అందులో ఎలాంటి తగ్గింపు గానీ, మార్పు గానీ జరగలేదని వివరించింది. జూన్ 3, 2026 నాడే ఆర్‌బీఐ ఈ వార్తలను అధికారికంగా ఖండించిందని, దేశ పసిడి నిల్వలు మునుపటి లాగే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంట్‌లో రాతపూర్వక సమాధానంలో స్పష్టం చేసింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే రగడ

మరోవైపు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విపక్షాలు ఇరు సభల్లోనూ తీవ్ర నిరసనలు తెలిపాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అదే సమయంలో ఢిల్లీ వీధుల్లోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు, మద్దతుదారులు పార్లమెంట్ వైపు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో, వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Tags:    

Similar News