Cold Drink War : కూల్ డ్రింక్ మార్కెట్‌లో ముదిరిన కోల్డ్ వార్.. షాపులకు ఫ్రీగా ఫ్రిజ్‌ల పంపిణీ

షాపులకు ఫ్రీగా ఫ్రిజ్‌ల పంపిణీ

Update: 2026-05-12 08:26 GMT

Cold Drink War : భారత సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో ఇప్పుడు యుద్ధం మామూలుగా లేదు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ క్యాంపా కోలాతో రంగంలోకి దిగడంతో దశాబ్దాలుగా ఏలుతున్న పెప్సీ, కోకాకోలా కంపెనీలకు చెమటలు పడుతున్నాయి. తమ మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్ దిగ్గజాలు ఇప్పుడు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా రిటైల్ వ్యాపారులకు, కిరాణా షాపులకు భారీ ఎత్తున ఉచితంగా కమర్షియల్ ఫ్రిజ్‌లు పంపిణీ చేస్తున్నాయి. కేవలం 10 రూపాయలకే క్యాంపా కోలాను అందుబాటులోకి తెచ్చి అంబానీ సృష్టించిన ప్రకంపనల నుంచి తేరుకోవడానికి అమెరికన్ కంపెనీలు ఈ డిస్ప్లే వార్‏ను మొదలుపెట్టాయి.

చమురు నుంచి రిటైల్ వరకు అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన రిలయన్స్, ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో నాలుగో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్యాంపా ఏకంగా రూ.4,700 కోట్ల విక్రయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అప్రమత్తమైన పెప్సీ బాట్లర్ వరుణ్ బెవరేజెస్ ఏకంగా 5 లక్షల కొత్త కూలింగ్ ఎక్విప్‌మెంట్లను మార్కెట్లో దింపాలని నిర్ణయించుకుంది. షాపుల్లో ఏ ఫ్రిజ్ ఉంటే ఆ బ్రాండ్ డ్రింక్సే ఎక్కువగా అమ్ముడవుతాయి కాబట్టి, ఇప్పుడు షాపుల లోపల ఉన్న ఖాళీ స్థలం కోసం ఈ కంపెనీల మధ్య పోరాటం జరుగుతోంది.

కంపెనీల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం చిన్న దుకాణదారులకు వరంగా మారింది. వేల రూపాయల పెట్టుబడి పెట్టే అవసరం లేకుండానే షాపులకు ఫ్రీగా ఫ్రిజ్‌లు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ చైన్ నెట్‌వర్క్ బలపడుతోంది. మరోవైపు ఈ డిమాండ్ పెరగడంతో బ్లూ స్టార్, వోల్టాస్, హయ్యర్ వంటి ఫ్రిజ్ తయారీ కంపెనీల సేల్స్ కూడా భారీగా పెరిగాయి. 2025 నాటికి 2.8 బిలియన్ డాలర్లుగా ఉన్న కమర్షియల్ ఫ్రిజ్ మార్కెట్, 2034 నాటికి 3.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఈ ఏడాది ఎండలు ముందే మొదలవ్వడం, సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండటంతో కూల్ డ్రింక్స్ అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇరాన్ వంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో అంతరాయాలు ఈ వృద్ధికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, రిలయన్స్ తన దూకుడును తగ్గించడం లేదు. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు క్యాంపాను చేరవేసేందుకు అంబానీ గట్టి ప్లాన్ వేయడంతో, దాన్ని అడ్డుకోవడానికి పెప్సీ, కోక్ తమ మార్కెటింగ్ బడ్జెట్‌ను భారీగా పెంచేశాయి.

Tags:    

Similar News