Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం ఇంధన ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేస్తూ వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నా కూడా భారతీయులపై భారం వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, మన దేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్రభుత్వం ఇచ్చిన హామీ

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత చూసి, భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అందరూ ఆందోళన చెందారు. దీనిపై పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం వినియోగదారులకు ఊరటనివ్వడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, ధరల పెంపు గురించి ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం

మరోవైపు, యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. పోర్ట్ అండ్ షిప్పింగ్ అధికారి ముకేశ్ మంగళ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. యుద్ధానికి ముందు హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు 138 నౌకలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 67కి పడిపోయింది. అంటే ఓడల రాకపోకలు సగానికి పైగా తగ్గిపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

భారత నౌకలు, నావికుల భద్రత

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భారతీయ జెండా ఉన్న ఏ కంటైనర్ నౌక కూడా ఈ ప్రమాదకర మార్గం గుండా వెళ్లడం లేదు. భద్రతా కారణాల రీత్యా మన ఓడలు ఈ మార్గానికి దూరంగా ఉంటున్నాయి. అయినప్పటికీ, వివిధ నౌకల్లో పని చేస్తున్న భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు జరగలేదని, నావికుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.

మున్ముందు ధరలు ఎలా ఉండవచ్చు?

ప్రస్తుతానికి ప్రభుత్వం ధరల పెంపును అడ్డుకున్నప్పటికీ, భవిష్యత్తు అంతా అంతర్జాతీయ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. ముడి చమురు ధరలు మరీ దారుణంగా పెరిగితే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి రావచ్చు. అయితే, విదేశీ నౌకల కదలికలకు సంబంధించిన సమాచారం మాత్రం ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది, ఎందుకంటే అది వాణిజ్యపరమైన డేటా కాబట్టి బహిరంగ పరచలేమని వెల్లడించింది. ఏది ఏమైనా, ఇప్పటికైతే వాహనదారుల జేబుకు ఎలాంటి ఇబ్బంది లేదని అర్థమవుతోంది.

Tags: