Gold Exchange : భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆస్తి. అయితే, ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు కొత్త బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో కొత్త నగలు మరింత ప్రియం కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే పాత బంగారం మార్పిడి.

పాత నగలకు పెరగనున్న క్రేజ్

బంగారం ధరలు భారీగా పెరగడంతో కొత్త నగలు కొనే బదులు, ఇంట్లో ఉన్న పాత నగలను ఇచ్చి వాటి స్థానంలో కొత్త డిజైన్లను తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతారని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల కొత్త బంగారం విక్రయాలు 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో జ్యువెలరీ షాపులకు వెళ్లే కస్టమర్లలో సగం మంది పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే వారే ఉంటారని ప్రముఖ నగల వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ రిటైల్ జ్యువెలరీ షోరూమ్‌లలో సగం అమ్మకాలు ఈ పాత బంగారం మార్పిడి ద్వారానే జరుగుతుండటం గమనార్హం.

భారతీయ కుటుంబాల దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ఒక అంచనా ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద ఏకంగా 25,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో మెజారిటీ భాగం ఏళ్ల తరబడి బీరువాల్లో, బ్యాంక్ లాకర్లలోనే ఉండిపోయింది. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల, ఈ నిల్వలు మార్కెట్లోకి రీసైక్లింగ్ రూపంలో వస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే బంగారం తగ్గడం వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.

గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్

కేవలం నగలు మార్చుకోవడమే కాకుండా, అత్యవసర నగదు అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరగనుంది. బంగారం విలువ పెరగడం వల్ల లోన్ తీసుకునే వారికి ఎక్కువ మొత్తం నగదు లభిస్తుంది. అయితే దిగుమతి సుంకం పెరగడం వల్ల ఒక ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకం పెరిగినప్పుడల్లా అక్రమ మార్గాల్లో బంగారం తరలించే గోల్డ్ స్మగ్లింగ్ పెరుగుతుందని, గతంలో ఏడాదికి దాదాపు 120 టన్నుల బంగారం ఇలాగే దేశంలోకి వచ్చేదని వారు గుర్తు చేస్తున్నారు.

తక్కువ క్యారెట్ల నగలే ప్రత్యామ్నాయమా?

ధరల భారంతో సతమతమవుతున్న కస్టమర్ల కోసం జ్యువెలరీ పరిశ్రమ మరో కొత్త ఆలోచన చేస్తోంది. 22 క్యారెట్ల నగల కంటే 14 క్యారెట్లు లేదా 9 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. దీనివల్ల బంగారం వినియోగం తగ్గడమే కాకుండా, తక్కువ బడ్జెట్‌లో విలాసవంతమైన నగలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త గోల్డ్ బార్‌లు లేదా కాయిన్లలో పెట్టుబడి పెట్టే కంటే, ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: