Royal Enfield : ఆంధ్రాలో బుల్లెట్ బండ్ల మోత.. రూ. 2,200 కోట్లతో భారీ ప్లాంట్.. 5,000 మందికి ఉద్యోగాలు

రూ. 2,200 కోట్లతో భారీ ప్లాంట్.. 5,000 మందికి ఉద్యోగాలు

Update: 2026-05-08 07:50 GMT

Royal Enfield : బుల్లెట్ బండి ప్రియులకు , ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో తన భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లాలో ఈ సరికొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతోంది. 1901లో కంపెనీ ప్రారంభమైన తర్వాత తమిళనాడు దాటి బయట రాష్ట్రంలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాంతం తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల రవాణా పరంగా కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వనేల్లూరు, రల్లకుప్పం గ్రామాల్లో సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఈ కొత్త ఫ్యాక్టరీ ద్వారా ఏడాదికి సుమారు 9 లక్షల బైకులను అదనంగా తయారు చేయాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ ప్లాంట్ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. కేవలం బైకుల తయారీనే కాకుండా, దీనికి అనుబంధంగా ఇతర విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో ఒక భారీ వెండర్ పార్క్‎ను కూడా కంపెనీ నిర్మిస్తోంది. దీనివల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు విడిభాగాలు సరఫరా చేసే చిన్న, మధ్యతరహా కంపెనీలు కూడా ఇక్కడికి తరలివస్తాయి. తద్వారా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక గొప్ప ఆటోమొబైల్ ఇకోసిస్టమ్ తయారవుతుంది. ఆటోమొబైల్ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కూడా కొత్త పెట్టుబడులు వచ్చేందుకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ భారీ ప్రాజెక్టును 2032 నాటికి పూర్తిగా పూర్తి చేయాలని కంపెనీ టైమ్ లైన్ పెట్టుకుంది. అందులో భాగంగా మొదటి దశ పనులను 2029 కల్లా పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌కు రావడం వల్ల రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారిపోతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కియా మోటార్స్ వంటి సంస్థలతో ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతున్న ఏపీకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ రాక మరో కలికితురాయిగా నిలవనుంది.

Tags:    

Similar News