Samsung : శాంసంగ్ మహా రికార్డు.. ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. ఏఐ చిప్‌ల డిమాండ్‌తో దూసుకెళ్తున్న షేర్లు

ఏఐ చిప్‌ల డిమాండ్‌తో దూసుకెళ్తున్న షేర్లు

Update: 2026-05-06 09:45 GMT

Samsung : టెక్ ప్రపంచంలో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ శామ్‌సంగ్ దశను మార్చేసింది. బుధవారం ట్రేడింగ్‌లో శామ్‌సంగ్ మార్కెట్ విలువ ఏకంగా $1 ట్రిలియన్ (సుమారు 84 లక్షల కోట్ల రూపాయలు) మైలురాయిని తాకింది. ఈ ఘనత సాధించిన రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్ రికార్డులకెక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో సెమీకండక్టర్లు, చిప్‌ల అవసరం విపరీతంగా పెరిగింది. ఇదే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు వరంగా మారింది. బుధవారం ట్రేడింగ్‌లో శామ్‌సంగ్ షేర్లు ఒక్కసారిగా 11% పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్ నిలిచింది. దీంతో కొరియా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ KOSPI ఏకంగా 7,000 పాయింట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.

శామ్‌సంగ్ సెమీకండక్టర్ యూనిట్ ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే లాభాల్లో ఏకంగా 48 రెట్ల పెరుగుదల కనిపించడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, మెషీన్ లెర్నింగ్ అవసరాల కోసం అవసరమయ్యే DRAM, NAND మెమరీ చిప్‌లకు భారీ ఆర్డర్లు రావడమే దీనికి కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో చిప్‌ల కొరత ఉండటం వల్ల ధరలు కూడా భారీగా పెరిగాయి, ఇది శామ్‌సంగ్‌కు భారీగా కలిసొచ్చింది.

ప్రస్తుతం ఆపిల్ తన ప్రొసెసర్ల తయారీ కోసం ఎక్కువగా TSMC పై ఆధారపడుతోంది. అయితే ఆ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి శామ్‌సంగ్‌తో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ డీల్ కుదిరితే శామ్‌సంగ్ మార్కెట్ విలువ మరిన్ని శిఖరాలను తాకడం ఖాయం. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు కూడా తమ ఏఐ ప్రాజెక్టుల కోసం శామ్‌సంగ్ చిప్‌లనే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి.

ఒకవైపు ఏఐ చిప్‌ల వ్యాపారం లాభాల్లో ఉన్నా, శామ్‌సంగ్ మొబైల్, డిస్ప్లే విభాగాలు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అలాగే ముడి పదార్థాల ధరలు పెరగడం కంపెనీపై భారాన్ని పెంచుతోంది. మరోవైపు ఏఐ ద్వారా భారీగా లాభాలు వస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఉద్యోగులు జీతాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ, మార్కెట్ నిపుణులు శామ్‌సంగ్ షేర్లలో ఇంకా 30% వృద్ధికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News