SBI Credit Card : SBI క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. జులై 15 నుంచి మారనున్న కీలక రూల్స్
జులై 15 నుంచి మారనున్న కీలక రూల్స్;
SBI Credit Card : ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. 2025 జులై 15 నుంచి ఎస్‌బీఐ కార్డ్స్ మినిమం అమౌంట్ డ్యూ లెక్కించే విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పు మీ నెలవారీ బిల్లు చెల్లింపుపై నేరుగా ప్రభావం చూపుతుంది, తద్వారా మీ జేబుపై భారీగా భారం పడవచ్చు. మినిమం అమౌంట్ డ్యూ (MAD) అంటే ప్రతి నెలా బిల్లింగ్ తేదీ లోపు మీరు తప్పనిసరిగా చెల్లించాల్సిన కనీస మొత్తం. ఈ మొత్తాన్ని చెల్లిస్తే, మీరు డిఫాల్టర్ గా పరిగణించబడరు, మీ క్రెడిట్ హిస్టరీ కూడా చెడిపోదు.
కొత్త నిబంధన ఏమిటి?
కొత్త నిబంధన ప్రకారం, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లు గతంలో కంటే ఎక్కువ మినిమం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఎక్కువ బకాయిలు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. కొత్త నిబంధన కింద, కిందివన్నీ 100% మినిమం అమౌంట్ డ్యూలో చేర్చబడతాయి.
* ఈఎంఐల మొత్తం.
* అన్ని ఫీజులు, ఛార్జీలు.
* ఫైనాన్స్ ఛార్జీలు (వడ్డీ)
* ఓవర్‌లిమిట్ అమౌంట్(ఏదైనా ఉంటే).
* జీఎస్టీ మొత్తం.
* టోటల్ అవుట్ స్టాండింగ్ లో 2%
అంటే, గతంలో ఉన్న పార్షియల్ పేమెంట్ అవకాశం ఇప్పుడు ఉండదు. గతంలో పాక్షిక చెల్లింపులు వడ్డీని పెంచేవి, ఇప్పుడు ఆ సౌలభ్యం ఉండదు.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డుపై మొత్తం బిల్లు రూ.1,00,000 అనుకుందాం. అందులో:
* ఫైనాన్స్ ఛార్జీలు: రూ.10,000
* ఫీజులు, ఇతర ఛార్జీలు: రూ.3,000
* జీఎస్టీ: రూ.3,000
అయితే, ఇప్పుడు కొత్త MAD ఇలా లెక్కించబడుతుంది:
రూ.10,000 (ఫైనాన్స్ ఛార్జీలు) + రూ.3,000 (ఛార్జీలు) + రూ.3,000 (జీఎస్టీ) + రూ.2,000 (మొత్తం బకాయిలో 2%) = రూ.18,000
దీని ప్రభావం ఎలా ఉంటుంది?
కస్టమర్‌లు ప్రతి నెలా కొంచెం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది, కానీ ఇది దీర్ఘకాలంలో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుతుంది. బాధ్యతాయుతంగా క్రెడిట్ మేనేజ్‌మెంట్ చేయడంలో ఈ చర్య కస్టమర్‌లకు సహాయపడుతుందని ఎస్‌బీఐ పేర్కొంది.
కార్డుహోల్డర్లు ఏం చేయాలి?
మీ కార్డ్ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా చదవండి. సమయానికి మరియు పూర్తిగా బిల్లును చెల్లించడానికి ప్రయత్నించాలి. ఈఎంఐపై కొనుగోళ్లు చేస్తే, ప్లాన్ ప్రకారం చెల్లింపులు జరిగేలా చూసుకోండి. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే, జులై 15 తర్వాత మీ నెలవారీ చెల్లింపు మొత్తం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ముందే ప్లాన్ చేసుకుని మీ ఖర్చులను, చెల్లింపులను జాగ్రత్తగా నిర్వహించుకోండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు పై ఎలాంటి ప్రభావం పడదు, అనవసరమైన వడ్డీల నుంచి కూడా బయటపడవచ్చు.