Scam Alert : రూ.350 ఇస్తే 5 లక్షల లోన్.. మీకూ ఇలాంటి లెటర్ వచ్చిందా?
మీకూ ఇలాంటి లెటర్ వచ్చిందా?
Scam Alert : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త స్కామ్‌కు తెరలేపారు. ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) పేరుతో వస్తున్న ఒక నకిలీ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కేవలం రూ.350 చెల్లిస్తే చాలు, రూ.5 లక్షల ముద్రా లోన్ మంజూరవుతుందన్న ఆశ చూపి సామాన్యుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఈ ప్రమాదకరమైన స్కామ్ గురించి ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
నకిలీ లెటర్ లో ఏముంది?
ఇప్పుడు మార్కెట్లో ఒక నకిలీ లోన్ అప్రూవల్ లెటర్ తిరుగుతోంది. ఇది చూడటానికి అచ్చం ప్రభుత్వ అధికారిక పత్రం లాగే ఉంది. ఇందులో మీకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 5 లక్షల బిజినెస్ లోన్ మంజూరైంది అని రాసి ఉంటుంది. అయితే, ఈ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలంటే, కేవలం రూ. 350 ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టాలని అందులో కండిషన్ ఉంటుంది. 5 లక్షల లోన్ ముందు 350 రూపాయలు ఏముందిలే అని ఎవరైనా ఆ డబ్బు చెల్లిస్తే, ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు సేకరించి అకౌంట్‌లోని డబ్బునంతా కాజేస్తున్నారు.
పీఐబీ (PIB) తేల్చిన పచ్చి నిజం
ఈ వైరల్ లెటర్ పై ప్రభుత్వం తరపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఆ లెటర్ పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పింది. ముద్రా యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎవరికీ ఇలాంటి ఉత్తరాలు పంపదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నకిలీ లెటర్ హెడ్‌లను సృష్టించారని, దయచేసి ఎవరూ ఇలాంటి వాటిని నమ్మి డబ్బులు కట్టవద్దని హెచ్చరించింది.
ముద్రా లోన్ అసలు రూల్ ఏంటి?
ముద్రా (MUDRA) అనేది నేరుగా ప్రజలకు అప్పు ఇచ్చే సంస్థ కాదు. ఇదొక రీ-ఫైనాన్సింగ్ ఏజెన్సీ. అంటే, ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు నిధులు సమకూరుస్తుంది. ఆ బ్యాంకులు మనకు లోన్లు ఇస్తాయి. కాబట్టి, నేరుగా ముద్రా నుంచి మీకు లోన్ వచ్చింది అంటే అది 100 శాతం మోసమే అని అర్థం చేసుకోవాలి. లోన్ కావాలనుకునే వారు నేరుగా తమకు దగ్గరలోని బ్యాంకులను సంప్రదించాలి తప్ప, ఆన్‌లైన్‌లో వచ్చే నకిలీ లింకులను నమ్మకూడదు.
సైబర్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?
డిజిటల్ కాలంలో మోసగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కానీ, మెసేజ్ పంపి కానీ లోన్ ఇస్తామంటే నమ్మకండి. ప్రభుత్వ పథకాల గురించి సమాచారం కావాలంటే ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే చూడాలి. మీ బ్యాంక్ ఓటీపీ (OTP) లేదా పిన్ (PIN) నంబర్లను ఎవరికీ చెప్పకండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయండి.