SEBI : ఆప్షన్స్ ట్రేడర్లకు సెబీ బిగ్ అలర్ట్.. లైవ్ మార్కెట్లోనే కొత్త స్ట్రైక్ ప్రైజ్‌లు

లైవ్ మార్కెట్లోనే కొత్త స్ట్రైక్ ప్రైజ్‌లు

Update: 2026-05-27 07:34 GMT

SEBI : భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్ల కోసం ఒక సంచలన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. మార్కెట్‌లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో ఆప్షన్స్ ట్రేడర్లు సరైన స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకోలేక ఇబ్బంది పడకుండా ఉండేందుకు సరికొత్త డైనమిక్ ఆప్షన్స్ స్ట్రైక్ ఫ్రేమ్‌వర్క్‎ను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. లైవ్ ట్రేడింగ్ జరుగుతున్న సమయంలోనే మార్కెట్ కదలికలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE) తక్షణమే కొత్త స్ట్రైక్ ప్రైజ్‌లను జోడించే లేదా అనవసరమైన వాటిని తొలగించే పూర్తి స్వేచ్ఛను పొందనున్నాయి.

సాధారణంగా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్‌లు లేదా స్టాక్స్ ఏదైనా ఒక పెద్ద వార్త కారణంగా ఒకే రోజు ఆకస్మికంగా భారీగా పెరిగినా లేదా పడిపోయినా ట్రేడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, నిఫ్టీ 24,000 వద్ద ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఇన్-ది-మనీ (ITM), అవుట్-ఆఫ్-ది-మనీ (OTM) స్ట్రైక్ ప్రైజ్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ మార్కెట్ హఠాత్తుగా 1000 పాయింట్లు దాటి దూసుకెళ్తే, ట్రేడర్ల వ్యూహాలకు సరిపోయే సరైన ఆప్షన్స్ కాంట్రాక్టులు ఆ రేంజ్‌లో అందుబాటులో ఉండవు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికే సెబీ ఈ కొత్త ముసాయిదా సిద్ధం చేసింది.

సెబీ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తే, లైవ్ ట్రేడింగ్ గంటల్లోనే మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎక్స్ఛేంజీలు కొత్త స్ట్రైక్‌లను ప్రవేశపెడతాయి. స్పాట్ ప్రైజ్ ఆధారంగా ట్రేడర్లకు ఎల్లప్పుడూ తగినన్ని ఆప్షన్స్ కాంట్రాక్టులు లభించేలా ఎక్స్ఛేంజీలు రోజువారీ సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మార్కెట్ ధరకు చాలా దూరంగా జరిగిపోయి, ఎలాంటి ట్రేడింగ్ వాల్యూమ్స్ లేని స్ట్రైక్ ప్రైజ్‌లను సిస్టమ్ నుండి తొలగించి ఆప్షన్ చైన్‌ను క్లియర్ చేస్తారు. ఈ నిబంధన ఈక్విటీతో పాటు కరెన్సీ, కమోడిటీ మార్కెట్లకు కూడా వర్తిస్తుంది.

లైవ్ మార్కెట్లో కొత్త కాంట్రాక్టులు యాడ్ చేయడం వల్ల జీరోధా, గ్రో, ఏంజెల్ వన్ లాంటి ట్రేడింగ్ యాప్స్ లేదా బ్రోకింగ్ కంపెనీల సాంకేతిక వ్యవస్థలపై ఎలాంటి అదనపు భారం పడకుండా సెబీ జాగ్రత్తలు తీసుకుంటోంది. లైవ్ మార్కెట్ నడుస్తున్నప్పుడు కొత్త స్ట్రైక్స్ వచ్చినప్పటికీ బ్రోకర్ల ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి టెక్నికల్ గ్లిచెస్ లేదా సిస్టమ్ నిలిచిపోవడం వంటి అంతరాయాలు కలగకుండా ఈ ప్రక్రియను డిజైన్ చేయాలని స్పష్టం చేసింది.

ఈ కొత్త విధానంలో ప్రాథమిక నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నప్పటికీ, రెండు స్ట్రైక్ ప్రైజ్‌ల మధ్య ఎంత గ్యాప్ ఉంచాలనేది మార్కెట్ లిక్విడిటీని బట్టి ఎక్స్ఛేంజీలే నిర్ణయించుకోవచ్చు. పారదర్శకత కోసం ఎక్స్ఛేంజీలు తమ స్ట్రైక్ ప్రైజ్ మేనేజ్‌మెంట్ నిబంధనలను వెబ్‌సైట్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ కీలక ప్రతిపాదనపై సెబీ సామాన్య ఇన్వెస్టర్లు, బ్రోకర్ల నుండి సలహాలను ఆహ్వానించింది. మార్కెట్ పార్టిసిపెంట్లు ఎవరైనా జూన్ 15, 2026 లోపు తమ అభిప్రాయాలను లేదా సలహాలను సెబీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటించింది.

Tags:    

Similar News