Stock Market : సెలవు తర్వాత సెన్సెక్స్ 1400 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి రూ.9 లక్షల కోట్లు

ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి రూ.9 లక్షల కోట్లు

Update: 2026-04-15 06:02 GMT

Stock Market : సెలవు తర్వాత భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాడు సరికొత్త ఉత్సాహంతో ఊపిరి పోసుకుంది. మంగళవారం విరామం తర్వాత బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే రాకెట్లా దూసుకెళ్లింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.9 లక్షల కోట్లు ఎగబాకడం విశేషం. బుధవారం ఉదయం సెన్సెక్స్ సుమారు 1,400 పాయింట్లు పెరిగి 78,270 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 400 పాయింట్లు ఎగబాకి 24,281 స్థాయిని తాకింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన మార్కెట్ దిశను మార్చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించుకోవడానికి పాకిస్థాన్‌లో చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయన్న వార్త ఇన్వెస్టర్లలో భరోసా నింపింది. యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి.

ముడి చమురు, రూపాయి దెబ్బ

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 95 డాలర్ల కంటే కిందకు పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. చమురు ధరలు తగ్గితే దేశంలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉండటంతో మార్కెట్ సానుకూలంగా స్పందించింది. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 12 పైసలు బలపడి 93.23 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ సానుకూల అంశాలన్నీ కలిసి మార్కెట్‌ను పరుగులు తీయిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్ల మద్దతు

ఆసియా మార్కెట్లైన జపాన్ నిక్కీ, కొరియా కోస్పి కూడా 1 నుంచి 3 శాతం లాభాల్లో ఉండటం భారత మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికన్ మార్కెట్లు నాస్డాక్ కూడా 2 శాతం వృద్ధితో ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగుపడింది. సెన్సెక్స్‌లోని టాప్ 30 కంపెనీలన్నీ గ్రీన్ జోన్‌లోనే ఉండటం విశేషం.

ఇన్వెస్టర్ల సంపద పెరిగిందిలా

బిఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో 449 లక్షల కోట్లుగా ఉండగా, బుధవారం ఉదయానికే అది 458 లక్షల కోట్లకు చేరింది. అంటే కేవలం కొద్ది నిమిషాల్లోనే రూ.9 లక్షల కోట్ల లాభం చేకూరింది. సాంకేతికంగా చూస్తే, నిఫ్టీ 24,300 స్థాయిని దాటితే ఈ ర్యాలీ 24,500 వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News