Stock Market : అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. రాకెట్లా దూసుకెళ్లిన భారత షేర్ మార్కెట్
రాకెట్లా దూసుకెళ్లిన భారత షేర్ మార్కెట్
Stock Market : వారపు మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులతో అదరగొట్టింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు వెల్లువెత్తింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా లాభపడింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 1.53 శాతం (దాదాపు 361 పాయింట్లు) బలపడి 23,950 మార్కును విజయవంతంగా దాటేసింది.
అమెరికా-ఇరాన్ డీల్‌తో మారిన గ్లోబల్ సెంటిమెంట్
భారత మార్కెట్లు ఇంత భారీగా ఎగబాకడానికి అంతర్జాతీయంగా జరిగిన ఒక చారిత్రాత్మక పరిణామమే ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం ముగింపు దశకు వచ్చిందని, వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించారు. ఈ గుడ్ న్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లలో భయాందోళనలు తొలగిపోయి, నమ్మకం పెరిగింది. దీని ప్రభావం సోమవారం ఉదయం మన దలాల్ స్ట్రీట్‌పై స్పష్టంగా కనిపించింది.
టాప్ గెయినర్స్, లూజర్స్ వీళ్లే
సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఆటోమొబైల్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టిఎమ్‌పివి వంటి కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే, ఇంతటి భారీ మార్కెట్ రాలీలోనూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఒఎన్‌జీసీ (ONGC), ఫార్మా దిగ్గజం సిప్లా, అపోలో హాస్పిటల్స్ వంటి కొన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతూ వెనుకబడ్డాయి.
మార్కెట్లో మరింత బుల్లిష్ ట్రెండ్
మార్కెట్ గమనంపై ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాష్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం టెక్నికల్ పరంగా చూస్తే మార్కెట్లో కొనుగోళ్ల సెంటిమెంట్ చాలా బలంగా ఉందన్నారు. రిలేటివ్ స్ట్రెన్త్ ఇండెక్స్ 51.25 స్థాయికి చేరుకుని బుల్లిష్ క్రాస్ఓవర్ను ప్రదర్శిస్తోందని తెలిపారు. దీని అర్థం మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఉన్న సుస్తి వీడి కొత్త కొనుగోలు శక్తి లభించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా, మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని సూచించే నెగటివ్ హిస్టోగ్రామ్ బార్స్ క్రమంగా చిన్నవిగా మారుతున్నాయని, అంటే మార్కెట్ పై బేర్స్ పట్టు కోల్పోతున్నాయని ఆయన విశ్లేషించారు.
నిఫ్టీ కీలక స్థాయిలు.. సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవే
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. నిఫ్టీ భవిష్యత్తు ప్రయాణానికి కొన్ని కీలక స్థాయిలు ఎంతో ముఖ్యం కానున్నాయి. నిఫ్టీకి ఎగువన మొదటి నిరోధం 23,800 వద్ద ఉండగా, ఆ తర్వాత 24,000 నుంచి 24,200 పరిధి అత్యంత కీలకం కానుంది. ఒకవేళ నిఫ్టీ గనుక 24,200 పైన స్థిరపడితే మార్కెట్లో సరికొత్త రికార్డుల పర్వం మొదలవుతుంది. అదే సమయంలో మార్కెట్ ఏవైనా కారణాల వల్ల లాభాల స్వీకరణకు లోనై కిందకు వస్తే.. దిగువన 23,500 వద్ద తక్షణ సపోర్ట్ లభిస్తుంది. ఆ తర్వాత 23,300 స్థాయి వద్ద నిఫ్టీకి అత్యంత బలమైన సపోర్ట్ జోన్ ఉంది.
రూపాయి రికార్డు స్థాయి రికవరీ
స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా లైన్ క్లియర్ అవ్వడంతో భారత కరెన్సీ రూపాయి విలువ కూడా భారీగా పుంజుకుంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరిగి 94.68 వద్ద ఓపెన్ అయింది. గత ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు రూపాయి ముగింపు 95.11 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం రూపాయికి కలిసివచ్చింది.