Mango Ban : కీటక నాశినుల ప్రభావం, క్వారంటైన్ లోపాలే కారణం..భారతీయ మామిడి పండ్లపై నేపాల్ బ్యాన్

భారతీయ మామిడి పండ్లపై నేపాల్ బ్యాన్

Update: 2026-06-10 02:13 GMT

Mango Ban : మామిడి పండ్ల ప్రియులకు పొరుగు దేశం నేపాల్ గట్టి షాక్ ఇచ్చింది. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే మామిడి పండ్లపై నేపాల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. భారతీయ మామిడి పండ్లలో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా కీటక నాశినులు ఉన్నాయని, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో సరైన క్వారంటైన్ తనిఖీ సదుపాయాలు లేవని పేర్కొంటూ నేపాల్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉండే సమయంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం.

స్థానిక రైతులకు మేలు.. కానీ సరిపోని ఉత్పత్తి

నేపాల్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సరిహద్దుల్లోని మధేష్ ప్రాంతంలో ఉండే స్థానిక రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ సీజన్ లో భారతీయ మామిడి పండ్లతో పోటీ పడాల్సిన అవసరం లేకపోవడంతో లోకల్ మార్కెట్లో స్వదేశీ మామిడి పండ్ల అమ్మకాలు పెరిగాయి. అయితే నేపాల్ దేశవ్యాప్తంగా ఉన్న మామిడి డిమాండ్‌ను కేవలం స్థానిక ఉత్పత్తితోనే భర్తీ చేయడం అసాధ్యమని మధేష్ ప్రాంత వ్యవసాయ శాఖ సమాచార అధికారి అజయ్ గ్యావలి అభిప్రాయపడ్డారు. నేపాల్ లో మామిడి ఉత్పత్తి కేవలం మే మధ్య వారం నుంచి జూలై మధ్య వారం వరకు అంటే కేవలం రెండు నెలలు మాత్రమే ఉంటుంది.

పరిశ్రమలపై ప్రభావం, వ్యాపారుల ఆందోళన

భారతదేశం నుంచి మామిడి దిగుమతులు నిలిచిపోవడం వల్ల కేవలం సాధారణ కస్టమర్లే కాకుండా, మామిడి పండ్ల ఆధారంగా నడిచే ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు, ఇతర ఆహార పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సంవత్సరం పొడవునా వ్యాపారం సాగించాలంటే భారత్ నుంచి దిగుమతులు తప్పనిసరని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జనక్‌పూర్‌ధామ్‌కు చెందిన ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ట్రేడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భువనేశ్వర్ పూర్బే మాట్లాడుతూ.. దిగుమతులను పూర్తిగా అడ్డుకోవడం కంటే బోర్డర్ లో క్వారంటైన్ వ్యవస్థను, క్వాలిటీ టెస్టింగ్‌ను బలోపేతం చేసి మంచి పండ్లను మార్కెట్ లోకి అనుమతించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఆకాశాన్ని అంటనున్న మామిడి ధరలు

ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మండులో కిలో మామిడి పండ్ల ధర దాదాపు 100 నుంచి 150 నేపాలీ రూపాయలు పలుకుతోంది. భారత్ నుంచి దిగుమతులపై నిషేధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ ధరలు ఊహించని స్థాయికి పెరుగుతాయని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గతంలో భారతదేశం నుంచి అరటిపండ్ల దిగుమతిని ఆపినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది వరకు డజన్ 120-150 NPR ఉన్న అరటిపండ్లు, దిగుమతులు ఆగిపోయాక ఏకంగా 250 నుంచి 300 NPR కు చేరి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయని వారు గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News